Bihar assembly elections 2025 : బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే, రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల తేదీల ఖరారు నుంచి ఓటింగ్ విధానం వరకు, ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ డిమాండ్లను, విన్నపాలను కేంద్ర ఎన్నికల సంఘం (EC) ముందుంచాయి. ఒకవైపు, రాష్ట్రంలో అతిపెద్ద పండుగైన ఛత్ పూజ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని అధికార, విపక్షాలు ఏకతాటిపై నిలిస్తే, మరోవైపు, బురఖా ధరించి ఓటు వేయడానికి వచ్చే మహిళలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్న బీజేపీ డిమాండ్ కొత్త చర్చకు దారితీసింది. అసలు ఈసీ పర్యటనలో పార్టీలు ఇంకా ఏయే అంశాలను ప్రస్తావించాయి?
బిహార్ శాసనసభ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం రెండు రోజుల పాటు పట్నాలో పర్యటించింది. ఈ సందర్భంగా, జేడీయూ, బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా అన్ని ప్రధాన పార్టీల ప్రతినిధులు ఈసీ బృందంతో సమావేశమై, తమ అభిప్రాయాలను వెల్లడించారు.
పార్టీల ప్రధాన డిమాండ్లు
ఛత్ తర్వాతే ఎన్నికలు (అన్ని పార్టీల ఏకాభిప్రాయం): దీపావళి, ఛత్ పండుగల కోసం ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది బిహారీలు సొంతూళ్లకు వస్తారని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని జేడీయూ, ఆర్జేడీ సహా అన్ని పార్టీలు ఈసీకి విజ్ఞప్తి చేశాయి. బిహార్‌లో ఛత్ పండుగ అక్టోబర్ 28న ముగియనుంది.
ఒకే విడతలో పోలింగ్ (జేడీయూ, బీజేపీ డిమాండ్): మహారాష్ట్ర మాదిరిగానే, బిహార్‌లో కూడా ఒకే విడతలో లేదా గరిష్ఠంగా రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని అధికార ఎన్డీఏ పక్షాలు కోరాయి. దీనివల్ల అభ్యర్థులకు ఖర్చులు తగ్గుతాయని, ఓటర్లకు సౌలభ్యంగా ఉంటుందని తెలిపాయి.
బురఖా ఓటర్ల తనిఖీ (బీజేపీ డిమాండ్): బురఖాలు ధరించి ఓటు వేయడానికి వచ్చే మహిళలను, వారి ఓటరు కార్డులతో సరిపోల్చి, క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బీజేపీ నేతలు ఈసీని కోరారు. ఇది బోగస్ ఓట్లను అరికట్టడానికి సహాయపడుతుందని వారు వాదించారు.
ఎస్ఐఆర్పై అభ్యంతరాలు (ఆర్జేడీ ఆరోపణ): ఇటీవల చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో, 3,66,000 ఓట్లను అక్రమంగా తొలగించారని, ఆ జాబితాను తమకు అందుబాటులో ఉంచాలని ఆర్జేడీ డిమాండ్ చేసింది.
నవంబర్‌లో ఎన్నికలు : ప్రస్తుత బిహార్ శాసనసభ గడువు నవంబర్ 22తో ముగియనుంది. పార్టీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటే, ఛత్ పండుగ తర్వాత, అంటే నవంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020లో మూడు దశల్లో ఎన్నికలు జరగగా, ఈసారి ఒకటి లేదా రెండు దశల్లోనే నిర్వహించేందుకు ఈసీ మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.


