Bihar Elections Women Receive Rs 10,000: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు నవరాత్రి కానుకను అందించింది. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పేరుతో తీసుకొచ్చిన పథకంలో భాగంగా మహిళల ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా 75 లక్షల మంది మహిళలకు రూ. 10,000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ. 7,500 కోట్లు ఖర్చు చేస్తోంది. మహిళల స్వీయ ఉపాధి, జీవనోపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో కుటుంబం నుంచి ఒక మహిళకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read: https://teluguprabha.net/news/telangana-group-1-appointments-2024-tgpsc-final-list/
ఈ కార్యక్రమం సందర్భంగా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నవరాత్రి సందర్భంగా బిహార్ మహిళల సంతోషంలో తానూ భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు. స్క్రీన్‌పై లక్షలాదిమంది మహిళలు కనిపిస్తున్నారన్న మోదీ.. వారి ఆశీర్వాదాలు గొప్ప బలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ మొదటి దశలో లబ్ధిదారులకు రూ. 10,000 చొప్పున నేరుగా జమ చేశారు. తర్వాత వివిధ దశల్లో రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ సాయం ద్వారా మహిళలు.. వ్యవసాయం, పశుపోషణ, హస్తకళ, నూలు, చిన్న వ్యాపారాలు వంటి రంగాల్లో ఈ నిధులను ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం సూచిస్తోంది.
ఈ పథకం ద్వారా కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, స్వయం సహాయ గ్రూపుల ద్వారా శిక్షణ కూడా అందిస్తోంది. మహిళలు ప్రారంభించే వ్యాపారాలకు గణనీయంగా మద్దతు ఇవ్వడానికి, గ్రామీణ హాట్ బజార్లను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.


