BJP’s Hindutva agenda in Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో, భారతీయ జనతా పార్టీ తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిందా? అభివృద్ధి నినాదం చాటున, మళ్లీ ‘హిందుత్వ’ అజెండానే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చిందా? యోగి ఆదిత్యనాథ్ “అభివృద్ధి వర్సెస్ బురఖా” వ్యాఖ్యల నుంచి, అమిత్ షా సీతామాత ఆలయ శంకుస్థాపన వరకు.. బీజేపీ అగ్రనేతల ప్రసంగాలు, కార్యక్రమాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అసలు కమలదళం వ్యూహమేంటి? ఇది బిహార్ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపనుంది..?
బీజేపీ ప్రచారంలో హిందుత్వ ఛాయలు : అయోధ్య, కాశీ, మధుర.. ఈ మూడు అంశాలు బీజేపీ రాజకీయ ప్రస్థానంలో విడదీయరానివి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత, ఇప్పుడు బీజేపీ తన దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.
అమిత్ షా ‘సీతామాత’ మంత్రం: ఈ ఏడాది ఆగస్టులో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీతామాత జన్మస్థలంగా భావించే సీతామర్హి జిల్లాలోని పునౌరా ధామ్‌లో, భవ్యమైన సీతా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. “రాముడికి అయోధ్య, సీతకు సీతామర్హి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, హిందూ ఓటర్లను ఏకం చేసే వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
యోగి ఆదిత్యనాథ్ ‘బురఖా’ వ్యాఖ్యలు: బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, “అభివృద్ధి వర్సెస్ బురఖా” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “విదేశాల్లో ఎయిర్‌పోర్టులలో ముఖం చూపించే బురఖా ధరించిన మహిళలు, ఓటు వేసేటప్పుడు మాత్రం చూపించరా?” అని ప్రశ్నిస్తూ, ఓ మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇది హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నమేనని స్పష్టమవుతోంది.
మోహన్ యాదవ్ ‘మధుర’ ప్రస్తావన: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మరో అడుగు ముందుకేసి, “అయోధ్య తర్వాత ఇప్పుడు మధుర వంతు వచ్చింది. మధురలో కన్నయ్య చిరునవ్వులు చిందిస్తున్నాడు,” అంటూ బీజేపీ భవిష్యత్ అజెండాను పరోక్షంగా బయటపెట్టారు.
వ్యూహం ఫలిస్తుందా : “బీజేపీ, హిందుత్వం అనేవి నాణేనికి బొమ్మాబొరుసు లాంటివి. వాటిని వేరు చేసి చూడలేం. ఆ పార్టీ రాజకీయ ప్రస్థానమే హిందుత్వ పునాదులపై ప్రారంభమైంది,” అని సీనియర్ జర్నలిస్ట్ కుమార్ రాఘవేంద్ర విశ్లేషించారు. సెక్యులర్ వాదిగా పేరున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభివృద్ధి, ఇతర వర్గాల ఓట్లపై దృష్టి సారిస్తే, బీజేపీ తన హిందుత్వ అజెండాతో మెజారిటీ హిందూ ఓట్లను గంపగుత్తగా దక్కించుకోవాలని చూస్తోందని స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, రామాయణ సర్క్యూట్ వంటి మతపరమైన ప్రాజెక్టులను కూడా ప్రచారంలోకి తీసుకువచ్చి, బిహార్ ఎన్నికల బరిలో గెలవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.


