Bihar Elections From November 8: బిహార్ శాసనసభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ సాయంత్రం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల తేదీలతో కూడిన షెడ్యూల్ ఖరారు చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. మొత్తం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం బిహార్‌లోని మొత్తం 243 శాసనసభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్ఆయి. ఈ ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల చివరి వారం ముగియనుంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, భాజపా కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, నితీష్ కేవలం రెండేళ్లకే ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే, ఈ బంధమూ ఎంతోకాలం కొనసాగలేదు. ఆర్‌జేడీతో వచ్చిన విభేదాల కారణంగా 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో, మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరాలు ఉంటే..
బిహార్‌లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై జ్ఞానేశ్ కుమార్ స్పందించారు ‘‘ఎస్‌ఐఆర్ ముసాయిదాను ఆగస్టు ఒకటిన విడుదల చేశాం. దానిని అన్ని రాజకీయ పార్టీలకు అందజేశాం. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేసే అవకాశం ఇచ్చాం. తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రకటించాం. ఇప్పటికీ అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం. ఓటరు జాబితాలో ఏవైనా పొరపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి’’ అని కోరారు. కాగా, ఈ ఎన్నికలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని జ్ఞానేశ్ తెలిపారు. బీహార్ ఎన్నికల కోసం మొత్తం 90 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. 7.43 కోట్ల మంది ఓటు వేయనున్నారని, వారిలో 3.92 కోట్ల మంది పురుషులు, 3.50 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు. రద్దీ నిర్వహణ కోసం ఒక్కో బూత్‌లో 1200 మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు వేసే ప్రక్రియను ఈ ఎన్నికలతోనే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
8న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..
ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని అంతా, ఝార్ఖండ్‌లోని ఘట్‌శిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్, పంజాబ్‌లోని తర్న్‌తారన్, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాఢాతోపాటు జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గామ్, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఈసీ వెల్లడించింది.


