Saturday, November 15, 2025
Homeనేషనల్Bihar Elections : బిహార్ గగనంలో ఎన్నికల 'హెలి-కాప్టర్ల' హోరు... ఖర్చుకు వెనకాడని పార్టీలు!

Bihar Elections : బిహార్ గగనంలో ఎన్నికల ‘హెలి-కాప్టర్ల’ హోరు… ఖర్చుకు వెనకాడని పార్టీలు!

Record helicopter bookings for Bihar election campaign: బిహార్ ఎన్నికల సంగ్రామానికి సర్వం సిద్ధమవుతోంది. అధికార ఎన్డీఏ, విపక్ష మహాఘట్‌బంధన్ కూటములు ఇప్పటికే మాటల తూటాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే, ఈసారి వారి వ్యూహం కేవలం నేలపైనే కాదు, నింగిలోనూ కొనసాగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలను చుట్టేయాలనే లక్ష్యంతో, ఇరు కూటములు రికార్డు స్థాయిలో హెలికాప్టర్లను బుక్ చేశాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే, ఈసారి ఏకంగా మూడు రెట్లు ఎక్కువ హెలికాప్టర్లు బిహార్ గగనంలో చక్కర్లు కొట్టనున్నాయి. అసలు ఈ ‘హెలికాప్టర్ రాజకీయాల’ వెనుక ఉన్న వ్యూహమేంటి..? ఏ పార్టీ ఎన్ని హెలికాప్టర్లను వాడుతోంది..? ఈ గగనతల ప్రచారానికి పార్టీలు వెచ్చిస్తున్న భారీ మొత్తం ఎంత..?

- Advertisement -

మూడు రెట్లు పెరిగిన బుకింగ్‌లు : 2020 శాసనసభ ఎన్నికల సమయంలో కరోనా సంక్షోభం కారణంగా, రెండు కూటములు కలిపి కేవలం ఆరు హెలికాప్టర్లను మాత్రమే ఉపయోగించాయి. కానీ, 2025 ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పట్నా విమానాశ్రయం లెక్కల ప్రకారం, ఈసారి ఎన్నికల ప్రచారంలో ప్రతిరోజూ సుమారు 20 హెలికాప్టర్లు ఎగరనున్నాయి. ఇది గతంతో పోలిస్తే మూడు రెట్లు అధికం.

ఎన్డీఏ జోరు: అధికార బీజేపీ, జేడీయూ కూటమి ఏకంగా డజనుకు పైగా హెలికాప్టర్లను సిద్ధం చేసుకుంది. ఒక్క బీజేపీయే రోజుకు 12-13 హెలికాప్టర్లను ఉపయోగించనుండగా, జేడీయూ రెండు హెలికాప్టర్లను వాడనుంది.

మహాకూటమి దూకుడు: విపక్ష కూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారంలో వెనకబడలేదు. వారు సంయుక్తంగా రోజుకు ఐదు హెలికాప్టర్లను (ఆర్జేడీ-2, కాంగ్రెస్-2, ఇతరులు-1) ఉపయోగించి ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు.

తడిసి మోపెడవుతున్న అద్దెలు : ఎన్నికల సమయంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా హెలికాప్టర్ల అద్దెలు కూడా ఆకాశాన్నంటాయి.

సింగిల్ ఇంజిన్: గంటకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు.
డబుల్ ఇంజిన్: గంటకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు.

నిబంధనల ప్రకారం, పార్టీలు కనీసం 3 గంటల ఫ్లయింగ్ ఛార్జీని ముందుగానే చెల్లించాలి. దీనికి అదనంగా 18% జీఎస్టీ కూడా ఉంటుంది. ఈ లెక్కన, ఒక హెలికాప్టర్ కోసం ఒక రాజకీయ పార్టీ రోజుకు సుమారు రూ.11 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

హెలికాప్టర్ ఎందుకంత ముఖ్యం : బిహార్ రాజకీయాల్లో హెలికాప్టర్‌కు కేవలం రవాణా సాధనంగానే కాకుండా, మరో రెండు కీలక ప్రయోజనాలు ఉన్నాయి.

సమయం ఆదా: తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించి, వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనడానికి ఇది నాయకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

జన సమీకరణ అస్త్రం: “బిహార్‌లో హెలికాప్టర్‌ను ఒక ‘క్రౌడ్ గ్యాదరర్’గా కూడా పరిగణిస్తారు,” అని స్థానిక విశ్లేషకులు చెబుతున్నారు. సభకు జనం తక్కువగా ఉన్నప్పుడు, నాయకులు హెలికాప్టర్‌ను సభా ప్రాంగణంపై రెండు, మూడు సార్లు చక్కర్లు కొట్టిస్తారు. ఆ హెలికాప్టర్‌ను చూసేందుకైనా పిల్లలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, తద్వారా సభ విజయవంతమవుతుందని నాయకుల నమ్మకం.

పార్టీల వాదన: “తక్కువ వనరులతోనే మేము ఎన్నికల్లో పోరాడుతాం. మా నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ విరిగిన జీపులో ప్రచారం చేసే గెలిచారు. అయితే, సమయాన్ని ఆదా చేసుకోవడానికి మా నాయకులు కూడా హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. ఈసారి విజయం మాదే,” అని ఆర్జేడీ నేత రాజేశ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, “మా కూటమిలో భాగస్వామ్య పక్షాలు ఎక్కువ, కాబట్టి ఎక్కువ ప్రాంతాలకు చేరుకోవడానికి మాకు ఎక్కువ హెలికాప్టర్లు అవసరం,” అని బీజేపీ ప్రతినిధి వినోద్ శర్మ తెలిపారు. ఏది ఏమైనా, రానున్న రోజుల్లో బిహార్ గగనతలం రాజకీయ పార్టీల హెలికాప్టర్ల రెక్కల చప్పుళ్లతో దద్దరిల్లిపోవడం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad