Saturday, November 15, 2025
HomeTop StoriesBihar Elections: మోదీ-యోగీ హుండీలు.. బిహార్ ఎన్నికల బరిలో కొత్త ఆయుధాలు!

Bihar Elections: మోదీ-యోగీ హుండీలు.. బిహార్ ఎన్నికల బరిలో కొత్త ఆయుధాలు!

Bihar election merchandise : బిహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజుకో కొత్త రంగు పులుముకుంటోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తుంటే, మరోవైపు కొన్ని వినూత్న వస్తువులు ప్రచారపర్వంలో భాగమైపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు ‘ఎలక్షన్ రసగుల్లా’పై వాడీవేడిగా చర్చ జరగగా, ఇప్పుడు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ రూపాల్లోని పిగ్గీ బ్యాంకులు (కిడ్డీ బ్యాంకులు) హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఈ మట్టి హుండీలను ఎవరు తయారు చేస్తున్నారు..? ఎందుకింతగా అమ్ముడవుతున్నాయి..? వాటి ప్రత్యేకతలేంటి..?

- Advertisement -

బిహార్ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ, ముజఫర్‌పూర్‌కు చెందిన శిల్పి జై ప్రకాశ్ చేతికి చేతినిండా పని దొరికింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ల సేవలకు ప్రభావితుడైన ఆయన, వారిద్దరినీ అచ్చుగుద్దినట్లు పోలిన పిగ్గీ బ్యాంకులను తయారు చేయడం ప్రారంభించారు. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. ఎన్నికల వేళ ఈ రాజకీయ రంగు పులుముకున్న హుండీలకు ఎన్‌డీఏ కూటమి నేతల నుంచి భారీ ఎత్తున ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దుకాణాల్లోకి సరుకు చేరిన గంటల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడైపోతుండటం విశేషం.

నెలల తరబడి శ్రమ.. గంటల్లో తయారీ : అచ్చం మోదీ, యోగీల ముఖ కవళికలు, ఆహార్యం, కళ్లద్దాలు, వస్త్రధారణ ఉట్టిపడేలా ఒక్కో పిగ్గీ బ్యాంకును తయారు చేయడానికి జై ప్రకాశ్‌కు తొలుత రెండు నెలల సమయం పట్టింది. నిరంతర సాధనతో, ఇప్పుడు కేవలం 5 నుంచి 7 గంటల్లోనే ఒక హుండీని పూర్తి చేయగలుగుతున్నారు. “నా శ్రమకు తగిన ఫలితాన్ని రాజకీయ నేతలు, ప్రజలు ఇస్తున్నారు. దుకాణాలకు విక్రయించిన కొన్ని రోజులకే మళ్లీ ఆర్డర్లు వస్తున్నాయి,” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఈ పిగ్గీ బ్యాంకులను సాధారణ బంకమట్టితో కాకుండా, అత్యంత నాణ్యమైన, మన్నికైన ‘టెర్రకోట’ బంకమట్టితో తయారు చేస్తున్నారు. ‘టెర్రకోట’ అంటే ‘కాల్చిన మట్టి’ అని అర్థం. ప్రత్యేకమైన బంకమట్టిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ఇది ముదురు ఎరుపు-గోధుమ రంగులో ఉండి, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటుంది. అందుకే ఈ హుండీలు ఎంతో కాలం మన్నుతాయి.

లక్ష రూపాయల పొదుపు.. మోదీకి బహుమతి : ఒక్కో పిగ్గీ బ్యాంకును రూ.1,200 నుంచి రూ.1,500 ధరకు విక్రయిస్తున్నారు. ఇందులో గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు నాణేలు, నోట్లను పొదుపు చేసుకోవచ్చని జై ప్రకాశ్ తెలిపారు. ముజఫర్‌పూర్‌లోని ఆమ్ గోలా ప్రాంతంలో అమ్ముడవుతున్న ఈ హుండీలకు బిహార్ నుంచే కాకుండా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. వీటిని ఎన్‌డీఏ నేతలు ఒకరికొకరు బహుమతులుగా ఇచ్చుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రాష్ట్రంలోని దర్భంగలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇలాంటి పిగ్గీ బ్యాంకును ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బహూకరించడం విశేషం.

“ప్రధాని మోదీ, సీఎం యోగీ దేశం కోసం ఎంతో మంచి పనిచేస్తున్నారు. వారికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ఆ అభిమానమే ఈ హుండీల రూపంలో కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో వీరికున్న క్రేజ్ వల్లే అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి,” అని జై ప్రకాశ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad