Saturday, November 15, 2025
Homeనేషనల్Bihar Elections : హామీల బాణం.. రూ.500కే గ్యాస్ సిలిండర్

Bihar Elections : హామీల బాణం.. రూ.500కే గ్యాస్ సిలిండర్

Bihar assembly election promises : బిహార్ ఎన్నికల కురుక్షేత్రంలో రాజకీయ వేడి రాజుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ ఒకే వేదికపై నుంచి ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శల తూటాలు పేల్చారు, హామీల బాణాలు సంధించారు. నీతీశ్ కుమార్ ప్రభుత్వం భాజపా చేతిలో ‘రిమోట్ కంట్రోల్’ సర్కార్‌గా మారిపోయిందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేయగా, తాము అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తేజస్వీ యాదవ్ భారీ హామీ ఇచ్చారు. అసలు నీతీశ్‌ ప్రభుత్వంపై వారు చేసిన ప్రధాన ఆరోపణలేంటి? ప్రజలను ఆకట్టుకునేందుకు వారు ఇచ్చిన హామీలేమిటి? దీనిపై భాజపా స్పందన ఏంటి?

- Advertisement -

‘రిమోట్‌’తో నడుస్తున్న ప్రభుత్వం: రాహుల్ గాంధీ : ముజఫర్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం నీతీశ్‌ను భాజపా ఒక సాధనంగా వాడుకుంటోందని, అసలైన పాలన దిల్లీ నుంచే సాగుతోందని ఆరోపించారు.

“బిహార్‌లో బిహారీలకు భవిష్యత్తు లేదు. ఇది కఠిన వాస్తవం. 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న నీతీశ్ కుమార్, వెనుకబడిన వర్గాల కోసం, యువతకు ఉద్యోగాల కోసం, విద్య, వైద్యం కోసం ఏం చేశారో చెప్పాలి. ఇక్కడ సామాన్యులకు ఏమీ దొరకదు కానీ, అదానీ వంటి వారికి మాత్రం రూపాయి, రెండు రూపాయలకే భూములు దక్కుతాయి. దేశ సంపదంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్లడం వల్లే బిహార్ వంటి రాష్ట్రాలు పేదరికంలో మగ్గుతున్నాయి.”
– రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

రూ.500కే సిలిండర్, ఇంటికో ఉద్యోగం: తేజస్వీ యాదవ్ : మరోవైపు, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ హామీల వర్షం కురిపించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే, బిహార్ తలరాతను మారుస్తానని, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రతినబూనారు.

20 ఏళ్ల నీతీశ్ పాలన, 11 ఏళ్ల మోదీ పాలన తర్వాత కూడా బిహార్ దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా ఉంది. నిరుద్యోగం, వలసలు పెరిగిపోయాయి. మా మహాగఠ్‌బంధన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి, వలసలకు ముగింపు పలుకుతాం. అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగం లేని ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పిస్తాం.”
– తేజస్వీ యాదవ్, ఆర్జేడీ అగ్రనేత

వీధి రౌడీలా మాట్లాడారు: భాజపా : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రధాని మోదీపై రాహుల్ వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తూ, ఆయనొక “వీధి రౌడీలా” మాట్లాడారని మండిపడింది. ప్రధానికి ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ రాహుల్ అవమానించారని, ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని దుయ్యబట్టింది. కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులకు బహిరంగంగా మద్దతునిస్తోందని భాజపా ఆరోపించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad