Saturday, November 15, 2025
Homeనేషనల్Cybercrime : సీఎం పేరుతోనే సర్టిఫికెట్... బీహార్‌లో కేటుగాడి ఘరానా మోసం!

Cybercrime : సీఎం పేరుతోనే సర్టిఫికెట్… బీహార్‌లో కేటుగాడి ఘరానా మోసం!

Fake residential certificate : అధికార యంత్రాంగాన్ని అపహాస్యం చేస్తూ, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరుతోనే నకిలీ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేయడం ఎక్కడైనా చూశారా..? బిహార్‌లో సరిగ్గా ఇదే జరిగింది. కుక్కలు, ట్రాక్టర్ల పేరుతో సర్టిఫికెట్లు జారీ చేసి వార్తల్లోకెక్కిన అధికారులు, ఈసారి ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పేరుతో వచ్చిన దరఖాస్తు చూసి ఖంగుతిన్నారు. అసలు ఎవరీ కేటుగాడు..? ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే కుట్ర దీని వెనుక ఉందా..? లేక ఇదొక ఆకతాయి చర్యా..? ఈ సంచలనాత్మక ఘటన పూర్తి వివరాలు మీకోసం.

- Advertisement -

ఆన్‌లైన్‌ తనిఖీలో వెలుగుచూసిన మోసం : బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లా, సరయ్య జోన్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. జూలై 29న రెవెన్యూ అధికారి అభిషేక్ సింగ్, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఒక దరఖాస్తుపై అనుమానం కలిగింది.

దరఖాస్తు వివరాలు: దరఖాస్తుదారు పేరు ‘నితీశ్ కుమారి’గా, తండ్రి పేరు లఖన్ పాసవాన్, తల్లి పేరు లకియా దేవిగా ఉంది.
సీఎం ఫోటోతో దరఖాస్తు: అయితే, దరఖాస్తుదారు ఫోటో స్థానంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఫోటోను అప్‌లోడ్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారి, దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించగా అది నకిలీదని నిర్ధారించుకున్నారు. “ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ కుట్ర పన్నారు” అని అభిషేక్ సింగ్ ఆరోపిస్తూ, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల రంగ ప్రవేశం.. నిందితుడి కోసం గాలింపు : రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు సరయ్య పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వ్యక్తి ఐపీ అడ్రస్ ఆధారంగా చిరునామాను ట్రాక్ చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.

ఇది తొలిసారి కాదు.. వింత దరఖాస్తుల వెల్లువ :  బిహార్‌లో ఇలాంటి విచిత్రమైన దరఖాస్తులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అధికారులను ముప్పుతిప్పలు పెట్టాయి.

డాగ్ బాబు’ సర్టిఫికెట్: గతంలో పాట్నాలో ‘డాగ్ బాబు’ అనే పేరుతో ఒక కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం జారీ కావడం, అది వైరల్ అవ్వడంతో అధికారులు దాన్ని రద్దు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.

ట్రాక్టర్‌కు ధ్రువపత్రం: మోతిహరి జిల్లాలో ‘సోనాలికా ట్రాక్టర్’ పేరుతో, తండ్రి పేరు ‘స్వరాజ్ ట్రాక్టర్’ అని పెట్టి దరఖాస్తు చేయగా, సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు.

మొబైల్ ఫోన్‌కు ఆదాయ ధ్రువపత్రం: జెహానాబాద్‌లో ‘శామ్‌సంగ్’ అనే పేరుతో, తండ్రి పేరు ‘ఐఫోన్’, తల్లి పేరు ‘స్మార్ట్‌ఫోన్’ అని పేర్కొంటూ ఆదాయ ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు రావడం గమనార్హం. ఈ వరుస ఘటనలు బీహార్ ఆన్‌లైన్ సేవల వ్యవస్థలోని లోపాలను, కొందరు ఆకతాయిలు వ్యవస్థతో ఎలా ఆడుకుంటున్నారో కళ్లకు కడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad