Impact of Darbhanga incident on Bihar women voters : ఎన్నికల నగారా మోగకముందే బిహార్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఓటర్ల జాబితా సవరణ ఆరోపణలతో వేడెక్కిన రాజకీయం, ఇప్పుడు ‘మాతృమూర్తి ఆత్మగౌరవం’ అనే సున్నితమైన అంశం చుట్టూ తిరుగుతోంది. దర్భంగలో తన తల్లిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అసభ్య వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటతడి పెట్టడంతో, ఈ వివాదం ఎన్నికల సంగ్రామంలో కీలక అస్త్రంగా మారింది. ఈ భావోద్వేగ కెరటం ఎన్‌డీఏకు లాభం చేకూరుస్తుందా? బిహార్ మహిళా ఓటర్లు ఎటువైపు నిలవబోతున్నారు..?
మోదీ కన్నీళ్లు.. బిహార్ ఓటర్లను కదిలిస్తాయా : ఆగస్టు 27న జరిగిన దర్భంగ ఘటనపై ప్రధాని మోదీ సెప్టెంబర్ 2న చేసిన భావోద్వేగ ప్రసంగం, బిహార్ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం రాజకీయ విమర్శగా కాకుండా, ఒక కొడుకు ఆవేదనగా మోదీ తన బాధను వ్యక్తం చేశారు.
ఛటీ మైయాతో అనుసంధానం: “ఒక తల్లిని అవమానించడాన్ని భారత భూమి ఎప్పుడూ సహించదు,” అంటూనే, బిహారీలు అత్యంత భక్తితో పూజించే ‘ఛటీ మైయా’ ప్రస్తావన తెచ్చారు. “మా అమ్మను అవమానించినందుకు ఛటీ మైయాకు ఆర్జేడీ, కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి,” అని డిమాండ్ చేయడం ద్వారా, ఆయన నేరుగా బిహార్ ప్రజల మనోభావాలను తాకారు.
పురుష ఓటర్లకు పిలుపు: “ఈ అవమానానికి కారకులైన వారిని జవాబుదారీగా నిలపాల్సిన బాధ్యత బిహార్‌లోని ప్రతీ కొడుకుపై ఉంది,” అంటూ పురుష ఓటర్లను సైతం ఈ అంశంలో భాగస్వాములను చేశారు.
ఎన్‌డీఏ వ్యూహం: మహిళా ఓటర్లే లక్ష్యం : ప్రధాని ప్రసంగం ఇచ్చిన ఊపుతో, ఎన్‌డీఏ కూటమి ఈ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
బంద్, ర్యాలీలు: ఈ ఘటనకు నిరసనగా బీజేపీ సెప్టెంబర్ 4న బిహార్ బంద్ నిర్వహించింది. త్వరలోనే మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ఉద్యమాలు నిర్వహించి, మహిళా ఓటర్లను ఏకం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. “రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ క్షమాపణ చెప్పే వరకు మా పోరాటం ఆగదు,” అని బీజేపీ అధికార ప్రతినిధి అనామిక పాశ్వాన్ స్పష్టం చేశారు.
విపక్షాల కౌంటర్ ఎటాక్ : బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు మహాఘట్‌బంధన్ కూటమి కూడా సిద్ధమైంది. గతంలో బీజేపీ నేతలు మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెరపైకి తెస్తూ ఎదురుదాడి ప్రారంభించింది.
తేజస్వి యాదవ్: “ఇతరుల తల్లులను దుర్భాషలాడిన చరిత్ర బీజేపీదే. ఈ అంశాన్ని రాజకీయం చేసి, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు,” అని ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు.
కాంగ్రెస్: “సోనియా గాంధీపై ప్రధాని మోదీ, బీజేపీ నేతలు గతంలో ఎలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు. ఏ మహిళపై అసభ్య వ్యాఖ్యలు చేసినా మేం ఖండిస్తాం,” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజేశ్ రాథోడ్ అన్నారు.
గెలుపోటములను నిర్దేశించే మహిళా శక్తి : బిహార్ రాజకీయాల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకం. గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
ఓట్ల శాతం: 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల ఓటింగ్ 54% కాగా, మహిళల ఓటింగ్ 60%గా నమోదైంది.
ఎన్‌డీఏ వైపు మొగ్గు: ఆ ఎన్నికల్లో 41% మంది మహిళలు ఎన్‌డీఏకు ఓటు వేయగా, మహాకూటమికి 31% మంది మాత్రమే మద్దతిచ్చారు.
గత చరిత్ర: మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన ప్రతిసారీ (2007 ‘మౌత్ కా సౌదాగర్’, 2014 ‘టీ అమ్మేవాడు’, 2019 ‘చౌకీదార్ చోర్’) అది బీజేపీకే లాభించిందని, గుజరాతీ సెంటిమెంట్‌ను రగిలించిందని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
“గత 15 ఏళ్లుగా బిహార్‌లో మహిళల ఓటింగ్ పెరగడం ఎన్‌డీఏకు లాభించింది. ఇప్పుడు ‘తల్లి సెంటిమెంట్’ను మహిళల ఉనికితో ముడిపెట్టి, ఎన్‌డీఏ ఓటర్లను మరింతగా తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంది,” అని రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ ‘దర్భంగ దంగల్’ రాబోయే ఎన్నికల్లో ఎవరికి వరం, ఎవరికి శాపమో తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.


