Pretshila Gaya photo ritual : చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని పిండ ప్రదానాలు చేయడం మనకు తెలుసు. కానీ, వారి ఫోటోలను చెట్లకు వేలాడదీయడం ఎప్పుడైనా చూశారా? బిహార్‌లోని గయ సమీపంలో ఉన్న ఓ కొండపై, రెండు మర్రిచెట్లు వేలాది ఫోటోలతో వింతగా దర్శనమిస్తున్నాయి. అకాల మరణం చెందిన వారి ఆత్మలు దెయ్యాలుగా మారకుండా, మోక్షం పొందేందుకు వారి కుటుంబ సభ్యులు పాటిస్తున్న ఈ వింత ఆచారం వెనుక ఉన్న నమ్మకాలేంటి..? అసలు ఏమిటీ ‘దెయ్యాల కొండ’ కథ..?
ఏమిటీ ‘ప్రేత్శిల’ : ‘ప్రేత్శిల’.. అంటే ‘దెయ్యాల కొండ’ అని అర్థం. గయా పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండపైకి చేరుకోవాలంటే 676 మెట్లు ఎక్కాలి. ఇక్కడి మర్రిచెట్లకు అకాల మరణం (ప్రమాదాలు, ఆత్మహత్యలు) చెందిన వారి ఫోటోలను వేలాడదీస్తే, వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పితృపక్ష మాసంలోనే, కేవలం ఏడు రోజుల వ్యవధిలో రెండు చెట్లపై ఏకంగా 15,000కు పైగా ఫోటోలను వేలాడదీశారంటే ఈ నమ్మకం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆచారం వెనుక ఆంతర్యం : ఈ వింత ఆచారం వెనుక ఉన్న నమ్మకాలను స్థానిక పూజారులు ఇలా వివరిస్తున్నారు.
మోక్షం కోసం: అనుకోకుండా చిన్న వయసులో చనిపోయిన వారి ఆత్మలు, దెయ్యాలుగా మారి ఇక్కడే ఉండిపోతాయి. వాటికి ముక్తి లభించదని చాలామంది నమ్ముతారు. ఇక్కడి మర్రిచెట్టుకు ఫోటో వేలాడదీసి, పిండ ప్రదానం చేసి, ‘సత్తు’ (వండిన బియ్యం, బార్లీ పిండి మిశ్రమం) ఊదడం వల్ల, వారి ఆత్మలు శాంతించి, విష్ణులోకానికి చేరుకుంటాయి,” అని పూజారి సంతోష్ గిరి తెలిపారు.
ఇంటి సమస్యల నివారణ: ఇంట్లో సమస్యలు, దుష్ట శక్తుల బాధలు తొలగిపోవడానికి కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ సుమారు 500కు పైగా ఫోటోలను ఈ చెట్లపై ఉంచుతారని, చైత్ర మాసంలో గంగా దసరా నాడు ఈ ఫోటోలన్నింటినీ నిమజ్జనం చేస్తారని పూజారులు చెబుతున్నారు.
భయం.. భక్తి.. భావోద్వేగం : ఈ చెట్లను చూస్తే భక్తులకు భయం, భక్తి కలగలిసిన వింత అనుభూతి కలుగుతుంది. “మా నాన్న రోడ్డు ప్రమాదంలో చిన్న వయసులోనే చనిపోయారు. ఆయన ఆత్మ దెయ్యంగా తిరుగుతోందని భావించి, ఇక్కడ ఫోటో వేలాడదీశాం. దీనివల్ల ఆయనకు మోక్షం లభిస్తుందని నమ్ముతున్నాం,” అని విజయ్ కుమార్ పాఠక్ అనే భక్తుడు తన ఆవేదనను పంచుకున్నారు. తండ్రులు తమ మరణించిన కుమారుల ఫోటోలను చెట్టుకు కడుతున్నప్పుడు అక్కడి వాతావరణం అత్యంత భావోద్వేగభరితంగా మారుతుందని పండిట్ శివ తెలిపారు.
పురాణ ప్రాశస్త్యం.. స్థానిక నమ్మకాలు : ఈ ప్రదేశానికి పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. బ్రహ్మదేవుడు ఈ కొండపై నడయాడాడని, ఆయన పాదముద్రలు ఇక్కడ ఉన్నాయని భక్తులు నమ్ముతారు. సాయంత్రం అయితే ఈ కొండపైకి వెళ్లడానికి స్థానికులు భయపడతారు. అకాల మరణం చెందిన వారి గొంతులు వినిపిస్తాయని, వారి ఆత్మలు ఇక్కడి రాతి శిలల్లో నివసిస్తాయని వారు నమ్ముతారు.


