Bihar school under tree : బడి గంట మోగగానే తరగతి గదుల్లోకి పరుగెత్తే విద్యార్థులు… గోడలపై అందమైన చిత్రాలు, నల్లబల్లపై అక్షరాలు… పాఠశాల అనగానే మన కళ్ల ముందు మెదిలే దృశ్యం ఇది. కానీ, బిహార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గంట మోగితే పిల్లలు పరుగెత్తేది తరగతి గదిలోకి కాదు, ఓ పెద్ద రావి చెట్టు కిందికి.. గడిచిన 23 ఏళ్లుగా చెట్టే వారికి తరగతి గది. ఆకాశమే పైకప్పు. కొమ్మలు విరిగి మీద పడతాయోమోనన్న భయం… వర్షం వస్తే ఆ రోజుకు చదువుకు సెలవు… ఇది ప్రభుత్వాలు మారినా మారని ఆ చిన్నారుల తలరాత. అసలు, 23 ఏళ్లుగా ఓ పాఠశాల ఎందుకు చెట్టు కిందనే నడుస్తోంది? ప్రభుత్వాల హామీలు ఏమయ్యాయి? మంత్రిగారి నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఎందుకు..? ఈ అక్షరాల ఆవేదన వెనుక ఉన్న వాస్తవాలేంటి..?
నిర్లక్ష్యపు నీడలో చదువులు : బిహార్ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదనడానికి దర్భంగా జిల్లాలోని ఈ పాఠశాలే నిలువుటద్దం. హనుమాన్‌నగర్ బ్లాక్, గోదియారీ గ్రామంలోని ‘లవాటోల్ ప్రాథమిక పాఠశాల’ దుస్థితి ఇది. పాఠశాల భవనం, తరగతి గదులు, బెంచీలు వంటి కనీస సౌకర్యాలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. ఓ పెద్ద రావి చెట్టు కిందే ఐదు తరగతుల విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. చెట్టు మొదలు వద్ద ఉన్న సిమెంట్ దిమ్మెనే ఉపాధ్యాయులు నల్లబల్లగా వినియోగిస్తున్నారు. ఈ పాఠశాలలో ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 267 మంది విద్యార్థులు చదువుతుండగా, వారికి పాఠాలు చెప్పేందుకు నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇద్దరు కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారు.
ప్రభుత్వాలు మారినా.. తలరాత మారలేదు : వెనుకబడిన ప్రాంతాల పిల్లలకు విద్యను అందించాలనే సదుద్దేశంతో 2003లో అప్పటి ఆర్‌జేడీ ప్రభుత్వం ‘లోక్ శిక్షా కేంద్రాల’ను ప్రారంభించింది. మూడేళ్ల తర్వాత వాటిని ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేశారు. అలా ఏర్పడినదే ఈ లవాటోల్ పాఠశాల. అప్పటి నుంచి ఇప్పటివరకు, అంటే 23 ఏళ్లుగా ఈ పాఠశాలకు సొంత భవనం నోచుకోలేదు. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు కానీ ఈ బడి తలరాత మాత్రం మారలేదు.
2006 నుంచి ప్రతి ప్రధానోపాధ్యాయుడు భవనం కోసం అధికారులకు విన్నవించడం, వారు హామీలు ఇవ్వడం పరిపాటిగా మారింది. 2016లో గ్రామస్థులే స్వయంగా రంగంలోకి దిగి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. చివరకు 2025 మే 19న పాఠశాల నిర్మాణానికి భూమి కేటాయించాలని విద్యాధికారి సర్కిల్ అధికారికి లేఖ రాసినా, దానిపై ఇప్పటికీ స్పష్టత కరువైంది.
మంత్రిగారి నియోజకవర్గంలోనే ఈ దుస్థితి : విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ పాఠశాల ఉన్న ప్రాంతం జేడీయూ ఎమ్మెల్యే, రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సహాని నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సొంత మంత్రి నియోజకవర్గంలోనే ఓ పాఠశాల ఇలా అనాథలా ఉండటంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
చిన్నారుల ఆవేదన.. “కొమ్మలు విరిగి పడుతున్నాయి” : “వర్షం వస్తే చదువు ఆపేసి ఇంటికి వెళ్లిపోవాలి, తగ్గాక మళ్లీ రావాలి. మా స్కూల్‌కు ఒక బిల్డింగ్ కావాలి,” అని విద్యార్థిని దామిని కుమారి ఆవేదన వ్యక్తం చేసింది. మరో విద్యార్థిని నందిని మాట్లాడుతూ, “నేను ఐదో తరగతి. స్కూల్లో చేరినప్పటి నుంచి చెట్టు కిందనే చదువుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం ఓ కొమ్మ నా స్నేహితురాలిపై పడింది. చాలా భయమేస్తోంది. అయినా చదువుకోవాలి కాబట్టి రోజూ వస్తున్నాం,” అని చెప్పింది.
హామీలు.. ఆందోళనలు : ఈ విషయంపై జిల్లా విద్యాధికారి కృష్ణానంద్ సదాను సంప్రదించగా, “మీ ద్వారా విషయం తెలిసింది. పాఠశాల నిర్మాణానికి రెండుసార్లు నిధులు కేటాయించినా కొన్ని కారణాల వల్ల పని పూర్తి కాలేదు. త్వరలోనే భవనాన్ని నిర్మిస్తాం,” అని హామీ ఇచ్చారు. అయితే, ఇది కూడా పాత హామీల లాంటిదేనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గణాంకాలు చెబుతున్న నిజాలు : బిహార్‌లో సుమారు 81,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 2024 జూన్ నాటికి 4,918 పాఠశాలలకు సొంత భవనాలు లేవు. వీటిలో 700 పాఠశాలలు షిఫ్ట్ పద్ధతుల్లో నడుస్తుండటం రాష్ట్ర విద్యావ్యవస్థలోని లోపాలను స్పష్టం చేస్తోంది.


