Saturday, November 15, 2025
Homeనేషనల్Bihar Polls: రేపే బీహార్‌ రెండో దశ పోలింగ్‌.. 122 స్థానాల్లో 3.7 కోట్లమంది ఓటర్ల...

Bihar Polls: రేపే బీహార్‌ రెండో దశ పోలింగ్‌.. 122 స్థానాల్లో 3.7 కోట్లమంది ఓటర్ల గెలుపోటముల్లో అత్యంత కీలకం..!

Bihar Second Phase Polling on Tomorrow: దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోన్న బీహార్‌ దంగల్‌ చివరి దశ పోలింగ్‌ రేపు (మంగళవారం) జరగనుంది. ఈ ఎన్నికలను రెండు జాతీయ పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్‌) అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. రెండో దశలో మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో 1,302 మంది అభ్యర్థుల భవితవ్యం మంగళవారం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. రెండో దశలో నీతీశ్‌ సర్కారులోని పలువురు మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు సైతం ఉన్నాయి. వీరంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సంక్లిష్టమైన బిహార్‌ సామాజిక వ్యవస్థలోని వివిధ వర్గాల మద్దతును నిలుపుకొనేందుకు పాలక ఎన్డీయే, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటములకు ఈ చివరి దశ పోలింగ్ కీలకం కానున్నాయి. రెండో దశ లేదా చివరి దశలో దాదాపు 3.70 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళలే ఉండటం విశేషం. ఇప్పటికే 45 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 40 వేల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

- Advertisement -

నాలుగు లకలకు పైగా సిబ్బదితో భద్రత..

పోలింగ్‌ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నాలుగు లక్షలకుపైగా సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢీ, మధుబని, అరారియా, కిషన్‌గంజ్ తదితర జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో చాలావరకు సీమాంచల్‌ ప్రాంతంలో ఉండగా ఇక్కడ ముస్లిం జనాభా అధికం. అత్యధికంగా హిసువా అసెంబ్లీ నియోజకవర్గంలో 3.67 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. లౌరియా, చన్‌పటియా, రక్సౌల్‌, త్రివేణిగంజ్‌, సుగౌలీ, బన్‌మన్‌ఖీ స్థానాల్లో అత్యధికంగా 22 మంది పోటీ చేస్తున్నారు.

కీలక స్థానాలన్నీ రెండో దశలోనే..

ఇక, సుపౌల్‌ స్థానం నుంచి మంత్రి బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ (జేడీయూ), గయా టౌన్‌ నుంచి మంత్రి ప్రేమ్‌ కుమార్‌ (బీజేపీ) వరుసగా ఎనిమిదోసారి పోటీ చేస్తున్నారు. జేడీయూ మంత్రులు రేణుదేవీ, నీరజ్‌ కుమార్‌ సింగ్‌, లేశీ సింగ్‌, శీలా మండల్‌, జమా ఖాన్‌, మాజీ ఉపముఖ్యమంత్రి తార్‌కిశోర్‌ ప్రసాద్‌ (బీజేపీ), కాంగ్రెస్‌ బీహార్‌ అధ్యక్షుడు రాజేశ్‌ కుమార్‌ ఇలా పలువురు ప్రముఖులు తమతమ స్థానాల నుంచి బరిలో దిగారు. వీరి స్థానాలకు రెండో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ఎన్డీయే కూటమిలోని హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం)కు కేటాయించిన ఆరు సీట్లు ఈ దశలోనే ఉన్నాయి. కేంద్ర మంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీకి చెందిన ఈ పార్టీ నుంచి నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరోసారి పోటీ పడుతున్నారు. కాగా, ఈ నెల 6న 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించిన తొలిదశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 65 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైన విషయం తెలిసిందే. రెండో దశలో ఓటింగ్‌ మరింత పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. అయితే, పోలింగ్‌ పెరగడం ఎవరికి లాభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్‌ శాతం పెరగడం తమకు కలిసి వస్తుందని అధికార, ప్రతిపక్ష కూటములు ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు. ఈ నెల 14న బీహార్‌ భవితవ్యం తేలనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad