Saturday, November 15, 2025
HomeTop StoriesBihar Elections: రికార్డు బ్రేకింగ్ పోలింగ్.. 11 గంటలకే 31.38 శాతం నమోదు!

Bihar Elections: రికార్డు బ్రేకింగ్ పోలింగ్.. 11 గంటలకే 31.38 శాతం నమోదు!

Bihar Second phase polling updates: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ పండగ వాతావరణంలా కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినుయోగించుకునేందుకు యువత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొదటి నాలుగు గంటల పోలింగ్ సరళి చూస్తుంటే.. ఈ విడతలో సైతం భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల వరకు 31.38 శాతం పోలింగ్ నమోదు అయినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉదయం 11 గంటల వరకు అత్యధిక ఓటింగ్ కిషన్‌గంజ్ జిల్లాలో (34.74% శాతం) నమోదు కాగా అత్యల్పంగా మధుబనీ జిల్లాలో (28.66 శాతం) నమోదు అయిందని ఎన్నికల అధికారి తెలిపారు. అలాగే గయా 34, జముఈ – 33.69, పూర్ణియా – 32.94, పశ్చిమ చంపారన్ – 32.39, నవాడా – 29.02, సీతామర్హి – 29.81 శాతం ఓట్లు పోలైనట్లుగా పేర్కొన్నారు.

- Advertisement -

బరిలో నిల్చిన 1,302 మంది అభ్యర్థులు: మొత్తం 243 స్థానాలకు గాను తుది దశలో 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. క్యూలో ఉన్న ఓటర్లకు 5 గంటల తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. రెండో విడతలో 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,95,44,041 మంది పురుషులు, 1,74,68,572 మంది మహిళలున్నారు. దాదాపు 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహించనున్నట్లుగా ఎన్నికల అధికారి తెలిపారు. తుది దశ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 1,302 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఇందులో ఒక ట్రాన్స్ జెండ‌ర్ సైతం ఉన్నారు.

ఫలితాలపై జన్ సురాజ్ పార్టీ ప్రభావం: బిహార్ ఎన్నికల్లో గెలుపుపై ఎన్‌డీఏ (బీజేపీ, జేడీయూ) మరియు మహాగఠ్‌బంధన్ (ఆర్‌జేడీ, కాంగ్రెస్) కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగింది. దీంతో ఆ పార్టీ సైతం .. ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 6న తొలి విడత పోలింగ్‌ జరుగగా.. నేడు రెండో విడత పోలింగ్‌ జరుగుతుంది. నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.

ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన తొలి విడత పోలింగ్‌లో 65.08% ఓటింగ్‌ నమోదయింది. ఈ సారి కూడా అదే కంటిన్యూ అవుతుందా ? లేక పోలింగ్ శాతం తగ్గుతుందా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. ఈ ఉప ఎన్నిక ఫలితం సైతం ఈ నెల 14న వెలువడనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad