Operation Sindoor Rakhi : రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనురాగానికి, ఆప్యాయతకు ప్రతీక. ఆ ఆత్మీయ అనుబంధానికి దేశభక్తిని జోడిస్తే..? సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న సైనికులకు, దేశాన్ని నడిపిస్తున్న ప్రధానికి అదే రాఖీతో రక్షాబంధనం కడితే..? బిహార్‌లోని ఓ కుగ్రామం ఇప్పుడు ఇదే చేస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్ రాఖీ’ పేరుతో వారు తయారు చేసిన ప్రత్యేక రాఖీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అసలు ఏమిటీ ‘ఆపరేషన్ సిందూర్ రాఖీ’..? విద్యార్థులే ఎందుకు దీన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు..? ఐఐటీయన్ల గ్రామంగా పేరుగాంచిన ఆ ఊరి వెనుక ఉన్న స్ఫూర్తిదాయక ప్రస్థానం ఏమిటి..?
ఐఐటీ ఆశావహుల సృజనాత్మకతకు నిలువుటద్దం : బిహార్‌లోని గయ జిల్లాలో ఉన్న ఓ చిన్న గ్రామమే పట్వటోలీ. రాఖీ పండుగను పురస్కరించుకుని ఈ గ్రామ విద్యార్థులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్ల కోసం సన్నద్ధమవుతున్న ఈ విద్యార్థులు, తమ సృజనాత్మకతకు దేశభక్తిని జోడించి “ఆపరేషన్ సిందూర్” పేరుతో ప్రత్యేక రాఖీలను తీర్చిదిద్దారు.
రెండు వేల రాఖీల తయారీ: సుమారు 2000 రాఖీలను విద్యార్థులు స్వయంగా తయారు చేశారు. వీటిని ఆగస్టు 9న రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పహారా కాస్తున్న భారత సైనికులకు పంపనున్నారు.
ప్రధానికి ప్రత్యేక రాఖీ: ప్రధాని మోదీకి పంపే రాఖీని త్రివర్ణ పతాకంతో అత్యంత ప్రత్యేకంగా రూపొందించారు. ఇది భారత సైన్యం సాధించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయానికి ప్రతీకగా నిలవనుంది.
“ఆపరేషన్ సిందూర్” స్ఫూర్తి వెనుక కారణం : పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకున్న తీరే ఈ ‘ఆపరేషన్ సిందూర్’ రాఖీల తయారీకి ప్రధాన స్ఫూర్తి.
పహల్గాం దాడి: 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
బిహార్ బిడ్డ బలిదానం: ఈ మృతుల్లో బీహార్‌లోని రోహ్‌తాస్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీశ్ రంజన్ కూడా ఉన్నారు. తన కుటుంబంతో పర్యటనకు వెళ్లిన ఆయన్ను, భార్యాబిడ్డల ఎదుటే ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన పట్వటోలీ విద్యార్థులను తీవ్రంగా కలచివేసింది.
తీర్చుకున్న ప్రతీకారం: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడం, దాడిలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరిగిందనే భావన తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, అందుకే ఈ థీమ్‌ను ఎంచుకున్నామని విద్యార్థిని శోభా కుమారి తెలిపారు.
ఐఐటీయన్ల గ్రామంగా పట్వటోలీ ప్రస్థానం : ఒకప్పుడు మామూలు గ్రామంగా ఉన్న పట్వటోలీ, నేడు ‘ఐఐటీయన్ల గ్రామం’గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ అద్భుతం వెనుక ‘వృక్ష బి ది ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ అవిరళ కృషి ఉంది.
ఉచిత శిక్షణ: ఈ సంస్థ 2013 నుంచి గ్రామ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది.
విజయ పరంపర: ఈ కృషి ఫలితంగా, ప్రతి ఏటా దాదాపు 50 మంది విద్యార్థులు ఐఐటీ, జేఈఈలలో విజయం సాధిస్తున్నారు. ఈ ఏడాది కూడా 48 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లలో సత్తా చాటారు.
స్ఫూర్తి ప్రదాతలు: 1992లో ఈ ఊరి నుంచి తొలి ఇంజినీర్ అయిన జితేంద్ర కుమార్, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి ‘వృక్ష బి ది ఛేంజ్’ సంస్థకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ఈ గ్రామం నుంచి 500 మందికి పైగా ఇంజినీర్లుగా స్థిరపడి, ప్రపంచంలోని 18 దేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు.


