Bihar Electoral Roll Review: ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ఓటు. కానీ ఆ ఓటర్ల జాబితానే పక్కదారి పడితే? అందులో లక్షలాది మంది పేర్లు గల్లంతైతే? సరిగ్గా ఇలాంటి ఓ సంచలనకరమైన వాస్తవం ఇప్పుడు బిహార్‌లో వెలుగుచూసింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (SIR) కోట్లాది ఓటర్ల లెక్క తేల్చే క్రమంలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో ఏకంగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు కనిపించకుండా పోయారు. అసలు ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు ఏమయ్యారు..? ఈసీ చేపట్టిన ఈ మహా ప్రక్షాళనలో వెలుగు చూసిన పూర్తి వివరాలేంటి..?
ఈసీ ప్రక్షాళన అంచెలంచెలుగా:
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు, రాష్ట్రంలో కాగితాలపై నమోదైన ఓటర్ల సంఖ్య 7.89 కోట్లుగా ఉండేది. అయితే, క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టి, వివరాలను సరిచూసినప్పుడు అసలు గుట్టు రట్టయింది.
బయటపడ్డ ప్రధాన అంశాలు…
గల్లంతైన ఓటర్లు: అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, సుమారు 52 లక్షల మంది ఓటర్లు వారు నమోదు చేసుకున్న చిరునామాలలో నివసించడం లేదని అధికారులు తేల్చారు. ఇది జాబితాలోని కచ్చితత్వంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
మరణించిన ఓటర్లు: ఓటరు జాబితాలో పేర్లు ఉండి, ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 18.66 లక్షలుగా గుర్తించారు. ఏళ్ల తరబడి వీరి పేర్లను జాబితా నుంచి తొలగించకపోవడం గమనార్హం.
వలస వెళ్లిన ఓటర్లు: దాదాపు 26 లక్షల మంది ఓటర్లు తమ నివాసాలను ఇతర నియోజకవర్గాలకు మార్చుకున్నట్లు స్పష్టమైంది.
డబుల్ ఓట్లు:
మరో 7 లక్షల మంది ఓటర్లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్లు ఈసీ అధికారులు గుర్తించారు. ఇది చట్టరీత్యా నేరం.
ఈ సవరణల అనంతరం, ఇప్పటివరకు 7.68 కోట్ల మంది ఓటర్ల వివరాలను మాత్రమే ధ్రువీకరించగలిగామని, మరో 21 లక్షల మంది తమ వివరాలను సమర్పించాల్సి ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
తదుపరి చర్యలు.. పారదర్శకతే లక్ష్యం: ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ఈసీ తెలిపింది.
ముసాయిదా జాబితా: ఆగస్టు 1 నుంచి ముసాయిదా ఎన్నికల జాబితాను ప్రచురించనున్నారు.
రాజకీయ పార్టీలకు సమాచారం: పేర్ల తొలగింపునకు గల కారణాలను వివరిస్తూ, రాష్ట్రంలోని 12 ప్రధాన రాజకీయ పార్టీలతో ఇప్పటికే వివరాలను పంచుకున్నారు.
అభ్యంతరాలకు అవకాశం: సెప్టెంబర్ 1 వరకు ఓటర్లు, రాజకీయ పార్టీలు, లేదా ఎవరైనా తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. జాబితాలో పేరు లేనివారు ఈ గడువులోగా నమోదు చేసుకోవచ్చు.
తుది జాబితా: అన్ని అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత, సెప్టెంబర్ 30న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.
సుప్రీం కోర్టు ఆమోదముద్ర:
ఈసీ చేపట్టిన ఈ సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం, ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. ఆధార్, రేషన్ కార్డుతో పాటు ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డును కూడా ప్రాథమిక పత్రంగా పరిగణించాలని సూచించింది. ఈసీని అనుమానించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తూ, ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య బలోపేతానికి అవసరమని పేర్కొంది.


