Bihar SIR draft voter list : ఎన్నికల వేళ ఓట్ల జాబితాలో లక్షల పేర్లు మాయం కావడం, ఆ వ్యవహారం ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కడం.. బిహార్‌లో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమేనా..? లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇందులో రాజకీయ కోణం దాగి ఉందా..? బతికున్న వారిని సైతం చనిపోయినట్లు చూపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?
ముసాయిదా విడుదల.. మొదలైన రగడ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. నెల రోజుల పాటు చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) అనంతరం ఈ జాబితాను ప్రకటించింది. అయితే, ఈ జాబితా ప్రకటనతోనే పెను వివాదం రాజుకుంది.
సవరణకు అవకాశం: ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను, సవరణలను స్వీకరించేందుకు సెప్టెంబర్ 1 వరకు గడువు విధించారు. అర్హుల పేర్లను చేర్చడానికి, అనర్హుల పేర్లను తొలగించడానికి రాజకీయ పార్టీలు, పౌరులు ఈసీని సంప్రదించవచ్చు.
బయటపడ్డ వాస్తవాలు: SIR ప్రక్రియలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్లు గుర్తించారు. సుమారు 26 లక్షల మంది ఓటర్లు ఇతర నియోజకవర్గాలకు శాశ్వతంగా వలస వెళ్లినట్లు తేలింది.
మరో 7 లక్షల మంది ఓటర్లు రెండు వేర్వేరు చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు అధికారులు కనుగొన్నారు. మొత్తం మీద 52 లక్షల మందికి పైగా ఓటర్లు వారు నమోదు చేసుకున్న చిరునామాల్లో అందుబాటులో లేరని స్పష్టమైంది.
సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు : ఈసీ చేపట్టిన SIR ప్రక్రియను కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఓటర్లను, ముఖ్యంగా తమ మద్దతుదారులను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
న్యాయవాదుల వాదన: పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ముసాయిదా జాబితా నుంచి దాదాపు 65 లక్షల మందిని తొలగిస్తున్నారని, దీనివల్ల వారు ఓటు హక్కు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ధర్మాసనం కీలక వ్యాఖ్యలు: ఈసీకి రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉన్నాయని గుర్తుచేసిన ధర్మాసనం, చట్టప్రకారమే అది పనిచేస్తుందని వ్యాఖ్యానించింది. “భారీగా ఓట్లు తొలగిస్తే మేం వెంటనే జోక్యం చేసుకుంటాం. ఈసీ చనిపోయారని చెబుతున్న వారిలో, బతికే ఉన్నారని మీరు భావిస్తున్న 15 మందిని కోర్టు ముందు హాజరుపరచండి” అని పిటిషనర్లను ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 12, 13 తేదీల్లో చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.


