Supreme Court on Bihar Voter List : బిహార్‌లో 65 లక్షల ఓట్ల గల్లంతుపై రేగిన రాజకీయ తుఫానులో, సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలతో జోక్యం చేసుకుంది. ‘ఓట్ల చోరీ’ జరిగిందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల హోరులో, ఎన్నికల సంఘం (EC) ఎట్టకేలకు సుప్రీంకోర్టు ముందు మెట్టు దిగింది. తొలగించిన ప్రతి పేరును బయటపెడతామని అంగీకరించింది. ఇంతకీ, సుప్రీంకోర్టు ఈసీకి నిర్దేశించిన మార్గదర్శకాలేంటి..? 2003 నాటి పత్రాల గురించి న్యాయస్థానం ఎందుకు ఆరా తీస్తోంది..? ఈ పరిణామం బిహార్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది..?
బూత్‌ల వారీగా జాబితా.. పక్కాగా ప్రచారం : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, తొలగించిన 65 లక్షల ఓటర్ల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని ఈసీని ఆదేశించింది. దీనికి అంగీకరించిన ఈసీ, గురువారం కోర్టుకు ఈ మేరకు హామీ ఇచ్చింది.
ప్రదర్శన ఇలా: తొలగించిన ఓటర్ల పేర్ల జాబితాను ప్రతి బూత్ స్థాయి అధికారి (BLO) కార్యాలయంలో, పంచాయతీ/బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తారు.
కారణాలు చెప్పాల్సిందే: వలస వెళ్లడం, డబుల్ రిజిస్ట్రేషన్, మరణం వంటి కారణాలను పేరు పక్కనే స్పష్టంగా పేర్కొనాలి.
విస్త్రృత ప్రచారం: జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో, అధికారిక సోషల్ మీడియా వెబ్‌సైట్లలో ఈ జాబితాలను ఉంచాలి. అంతేకాకుండా, వార్తాపత్రికలు, రేడియో, టీవీల ద్వారా కూడా ప్రజలకు సమాచారం అందించాలి.
ఈ చర్యలన్నీ వచ్చే మంగళవారం నాటికి పూర్తి చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. దీనివల్ల, జాబితాలో తమ పేరు పొరపాటున తొలగించబడిందని భావించే అర్హులైన ఓటర్లు, ఆధార్ కార్డు కాపీతో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.
2003 నాటి పత్రాలపై ఆరా : జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం, ఈసీని ఓ కీలకమైన ప్రశ్న అడిగింది. 2003లో బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ జరిగినప్పుడు, గుర్తింపు కోసం ఏయే పత్రాలను పరిగణనలోకి తీసుకున్నారో తమకు తెలియజేయాలని ఆదేశించింది.
“2023 జనవరిలో సవరణ చేసి ఓటర్ కార్డులు (EPIC) జారీ చేశారు. ఇప్పుడు మళ్లీ SIR పేరుతో అప్పుడు జారీ చేసిన కొన్ని కార్డులు చెల్లకుండా పోయాయి. ఇది ఎలా సాధ్యం? రెండు ప్రక్రియల్లో నమోదు విధానం ఒకేలా ఉన్నప్పుడు, పాత కార్డులను ఎలా విస్మరిస్తారు?”
– నిజాం పాషా, పిటిషనర్ తరఫు న్యాయవాది
ఓటరు నమోదు ఫారమ్ దాఖలు చేసినప్పుడు ఈసీ ఎలాంటి రసీదు ఇవ్వడం లేదని, దీనివల్ల కింది స్థాయి అధికారులకు విచక్షణాధికారం పెరిగిపోతోందని కూడా న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఓటర్ల జాబితాలు స్థిరంగా ఉండవని, వాటిని సవరించే హక్కు ఎన్నికల సంఘానికే ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.


