కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వక్ఫ్ సవరణ బిల్లు’ (Waqf Bill) బుధవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ముందుగా లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అనంతరం రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయేకు లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీల బలం ఉండటంతో బిల్లు సులభంగానే పాస్ అవ్వనుంది. అయితే బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, ఎంఐఎం, తదితర పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఎంపీలు సభకు కచ్చితంగా హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు సభకు రావాలని ఆదేశించాయి.
ప్రస్తుతం రెండు సభల్లో అధికార ఎన్డీయేకి ఫుల్ మెజారిటీ ఉంది. లోక్‌సభలో వక్ఫ్ బిల్లుకు 298 మంది ఎంపీల మద్దతు ఉండగా.. వ్యతిరేకంగా 233 మంది సభ్యులు ఉన్నారు. తటస్థంగా 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇక రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 122 మంది ఎన్డీయే సభ్యుల మద్దతు ఉండగా.. వ్యతిరేకంగా 116 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో బిల్లు పాస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.