BJP dominance : భారత రాజకీయ ముఖచిత్రంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు సాగిన కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం మళ్లీ పునరావృతం కాబోతోందా? ఈసారి ఆ చారిత్రక రికార్డును కమలదళం తన పేరున లిఖించుకోనుందా? అజేయ శక్తిగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీ (BJP) ప్రస్థానానికి ఇప్పట్లో బ్రేకులు పడే అవకాశం లేదా? మరోవైపు అరవై ఏళ్ల ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టి, తమిళనాట ‘తళపతి’ విజయ్ సృష్టించిన సంచలనానికి అసలు కారణమేంటి? పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సామ్రాజ్యం ఎందుకు కుప్పకూలింది? ఈ ఆసక్తికర ప్రశ్నలన్నింటికీ ప్రఖ్యాత ఎన్నికల విశ్లేషకుడు, ‘యాక్సిస్ మై ఇండియా’ అధినేత ప్రదీప్ గుప్తా తన తాజా ఇంటర్వ్యూలో సవివరమైన సమాధానాలు ఇచ్చారు.
కమలానికి పట్టాభిషేకం.. కాంగ్రెస్‌కు అగమ్యగోచరం : దేశ రాజకీయాలు ఒక సుదీర్ఘమైన వలయంలో పయనిస్తుంటాయని, ప్రస్తుతం బీజేపీ ఆ ఆధిపత్య చక్రం మధ్యలో ఉందని ప్రదీప్ గుప్తా విశ్లేషించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎలాగైతే నిరంతరాయంగా ఏలిందో, ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహాలో ఉంటుంది అన్నారు. కేంద్రంలో బీజేపీ పాలన గాడితప్పనంత కాలం, ఆ పార్టీ పనితీరు క్షీణించనంత వరకు కనీసం మరో 20 ఏళ్ల పాటు దేశంలో వారిదే ఆధిపత్యం అని కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్షాలు వరుస పరాజయాలను చవిచూడక తప్పదన్నారు.
అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా చేశారు. ఎప్పుడైతే ఒక పార్టీ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తుందో, సహజంగానే వారిపై ప్రజల అంచనాలు ఆకాశాన్ని అంటుతాయని, ఆ ఒత్తిడిని తట్టుకోవడం కమలనాథులకు ఒక సవాల్ అని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. గతంలో వారు చేసిన దుష్పరిపాలన భారాన్ని ఆ పార్టీ ఇంకా మోస్తోందని, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కనీసం మరో 15 ఏళ్ల సమయం పడుతుందని, అంతవరకు హస్తం పార్టీకి అధికార పీఠం దూరమేనని తేల్చిచెప్పారు.
Also Read: https://teluguprabha.net/business/maruti-suzuki-car-prices-hike/
ద్రవిడనాట దళపతి దండయాత్ర.. పక్కా లెక్కలతోనే : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర సర్వే సంస్థలన్నీ డీఎంకే వైపు మొగ్గుచూపగా, ‘యాక్సిస్ మై ఇండియా’ మాత్రం విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ అధికారంలోకి వస్తుందని కచ్చితమైన అంచనా వేసింది. దీనిపై ప్రదీప్ గుప్తా స్పందిస్తూ.. ఎన్నికలకు ఏడాది ముందే తాము విజయ్ ఎదుగుదలను పసిగట్టామన్నారు. 50 ఏళ్లుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూ తిరిగిన ద్రవిడ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని, ఒక స్పష్టమైన మార్పు (Change) కోరుకున్నారని ఆయన తెలిపారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే బలహీనపడటం విజయ్‌కు కలిసొచ్చిందన్నారు.
పదేళ్లుగా తన సినిమాల్లో వ్యవస్థపై పోరాడే నాయకుడిగా విజయ్ తెచ్చుకున్న ఇమేజ్ ఆయనకు శ్రీరామరక్షగా నిలిచింది. ఆరు నెలల ముందు విజయ్ ఓటు బ్యాంకు 25 శాతంగా ఉంటే, పోలింగ్ నాటికి అది 35 శాతానికి చేరుకుంటుందని మా సర్వే తేల్చింది. మేము 109 సీట్లు వస్తాయని చెబితే, టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది” అని గుప్తా తమ సర్వే కచ్చితత్వాన్ని గర్వంగా వివరించారు.
పంజాబ్‌లో చతుర్ముఖం.. యూపీలో ‘యోగి’తం!
ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంపై కూడా ఆయన స్పష్టమైన అంచనాలు వెలువరించారు.
ఉత్తరప్రదేశ్: ఇక్కడ అధికార బీజేపీ పాలన పట్ల ప్రజలు అత్యంత సంతృప్తితో ఉన్నారని గుప్తా స్పష్టం చేశారు. 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళానికి పెద్దగా ఇబ్బందులు ఎదురుకావని, అయితే అక్కడి ఓటర్ల మనోభావాలు వేగంగా మారే అవకాశం ఉన్నందున ఏమరుపాటు పనికిరాదని సూచించారు.
పంజాబ్: ఇక్కడ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వంపై మిశ్రమ స్పందన ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ(NDA), శిరోమణి అకాలీదళ్ మధ్య చతుర్ముఖ పోటీ (Four-cornered contest) నెలకొంటుందని, ఈ ఓట్ల చీలిక అంతిమంగా అధికార పక్షానికే మేలు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు.
బెంగాల్‌లో మమత పరాభవానికి అసలు కారణమిదే : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) చిత్తుగా ఓడిపోవడానికి, బీజేపీ ప్రభంజనం సృష్టించడానికి కేవలం ‘హిందూ ఓట్ల ఏకీకరణ’ మాత్రమే కారణం కాదని గుప్తా కుండబద్దలు కొట్టారు. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ సాగించిన దుష్పరిపాలన, ప్రజల్లో వారు సృష్టించిన భయాందోళనలే టీఎంసీ కొంపముంచాయన్నారు. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) క్షేత్రస్థాయి సంస్థాగత బలం తోడవడంతోనే బెంగాల్‌లో కాషాయ జెండా ఎగిరిందని ఆయన స్పష్టం చేశారు.

