West Bengal political violence : పశ్చిమ బెంగాల్‌ను వరదలు ముంచెత్తుతుంటే, రాజకీయాలు భగ్గుమంటున్నాయి. బాధితులకు సహాయం అందించడానికి వెళ్లిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై కొందరు రాళ్ల దాడికి పాల్పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం మొదలైంది. ప్రకృతి విపత్తు వేళ ప్రబలిన ఈ రాజకీయ విపత్తుకు కారణాలేంటి..? క్షేత్రస్థాయిలో ఏం జరిగింది..? ఇరు పక్షాల వాదనల్లో పస ఎంత..?
పశ్చిమ బెంగాల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం వెళ్లిన బీజేపీ నేతలపై జరిగిన దాడి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఇదే నిదర్శనమని ప్రధాని మోదీ విమర్శించగా, ప్రకృతి వైపరీత్యాన్ని కూడా ప్రధాని రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు.
ఉత్తర మాల్దా నియోజకవర్గ బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము, స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌తో కలిసి జల్‌పాయీగుడీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ సామగ్రిని పంపిణీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వారిపైకి రాళ్లు రువ్వడంతో ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి.
ప్రధాని మోదీ తీవ్ర ఖండన: ఈ దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. “క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులపై దాడి చేయడం దారుణం. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హింసను పక్కనపెట్టి ప్రజలకు సాయం చేయడంపై దృష్టి పెట్టాలి. ఈ ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి, టీఎంసీ అసమర్థతకు అద్దం పడుతోంది,” అని దుయ్యబట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సహాయ కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రధాని వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ధీటైన బదులు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, విచారణ జరగకుండా తన ప్రభుత్వంపై నిందలు వేయడం దురదృష్టకరమని, ఇది ప్రధాని కార్యాలయ గౌరవాన్ని తగ్గించే చర్య అని ఆమె మండిపడ్డారు.
“ఇది రాజకీయాలు చేసే సమయం కాదు, ఐక్యంగా ప్రజలను ఆదుకోవాల్సిన సమయం,” అని మమతా బెనర్జీ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యలలో నిమగ్నమై ఉండగా, స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బీజేపీ నేతలు పెద్ద కాన్వాయ్‌లతో, కేంద్ర భద్రతా బలగాలతో ప్రభావిత ప్రాంతాలకు వచ్చారని ఆమె ఆరోపించారు. అటువంటి పరిస్థితులలో జరిగిన ఘటనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బాధ్యులను చేస్తారని ఆమె ప్రశ్నించారు.
“చట్టం తన పని తాను చేసుకుపోవాలి, రాజకీయ వేదికల నుంచి చేసే ట్వీట్లు కాదు నేరస్థులను నిర్ణయించేది,” అని దీదీ విమర్శించారు. అంతేకాకుండా, ఈ దాడి జరిగింది కూడా బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనేనని, అయినా తృణమూల్ కాంగ్రెస్‌పై నిందలు వేయడం అపరిపక్వమైన చర్య అని ఆమె అన్నారు.
వరదలకు మానవ తప్పిదమే కారణమా : మరోవైపు, బెంగాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలకు మానవ తప్పిదమే కారణమని మమతా బెనర్జీ ఆరోపించారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతోనే దక్షిణ బెంగాల్‌లోని నదులు పొంగిపొర్లుతున్నాయని ఆమె మండిపడ్డారు. డీవీసీ డ్యామ్‌ల వద్ద పూడిక తీయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఇది “మానవ నిర్మిత వరద” అని ఆమె అభివర్ణించారు.


