రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. మరోవైపు బీజేపీ ఎంపీలు కూడా పోటీగా నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ-కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం అయింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తోయడంతోనే తన తలకు గాయం అయిందని ఆయన ఆరోపించారు.
కాగా ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో చాలా కెమెరాలు ఉన్నాయని.. తాను పార్లమెంటు ప్రవేశద్వారం ద్వారా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించానని.. కానీ బీజేపీ ఎంపీలు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ క్రమంలో వారిని తోసుకుంటు లోపలికి వెళ్లే ప్రయత్నంలో ఓ ఎంపీని తీసేయడంతో అలా జరిగి ఉండవచ్చని తెలిపారు. మొత్తానికి అంబేద్కర్ అంశంపై పోటాపోటీ నిరసనలతో పార్లమెంట్ ఆవరణలో గందరగోళం నెలకొంది.