BJP Rajya Sabha Tally అధికార భారతీయ జనతా పార్టీ బీజేపీకి రాజ్యసభలో గణనీయమైన బలం చేకూరింది. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు పార్టీలో చేరడంతో 2022 ఏప్రిల్ తర్వాత మొదటిసారిగా రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 100 మార్కును అధిగమించింది.
ప్రముఖ న్యాయవాది ఉజ్జ్వల్ నికమ్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా, సంఘ సేవకుడు సి. సదానందన్ మాస్టర్ గత నెలలో రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వారం వీరు బీజేపీలో చేరడంతో పార్టీ సభ్యుల సంఖ్య 102కు చేరుకుంది.
రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు (238 మంది ఎన్నికైనవారు, 12 మంది రాష్ట్రపతిచే నామినేట్ చేయబడినవారు) ఉండవచ్చు. ప్రస్తుతం, 12 మంది నామినేటెడ్ సభ్యులతో సహా మొత్తం 245 మంది ఎంపీలు ఉన్నారు.
2022 మార్చి 31న జరిగిన 13 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, భారతదేశ చరిత్రలో రాజ్యసభలో 100 మందికి పైగా ఎంపీలు ఉన్న రెండవ పార్టీగా బీజేపీ నిలిచింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 1988, 1990 మధ్య ఈ ఘనతను సాధించింది. ఆ సమయంలో బీజేపీ బలం 97 నుండి 101కి పెరిగింది. తాజా చేరికలతో బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకుంది. ఇది ప్రభుత్వానికి చట్టాల ఆమోద ప్రక్రియలో మరింత ఊపునివ్వనుంది.


