దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నాయి. తాజాగా బీజేపీ(BJP) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ(Parvesh Verma) పేరును ఖరారు చేసింది. ఇదే స్థానం నుంచి ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ స్థానానికి మాజీ సీఎం షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది.
కాగా 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. మరికొన్ని రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా.. కాంగ్రెస్ పార్టీ కొంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తాజాగా బీజేపీ కూడా తొలి జాబితా అభ్యర్థులను వెల్లడించింది.