Rahul Gandhi foreign remarks controversy : రాహుల్ గాంధీ విదేశీ పర్యటన మరోసారి రాజకీయ దుమారం రేపింది. కొలంబియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు “దేశ ప్రజాస్వామ్యంపై దాడి” అంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అధికారం దక్కడం లేదన్న నైరాశ్యంతోనే రాహుల్ దేశ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని కమలదళం ఆరోపిస్తోంది. ఇంతకీ కొలంబియాలో రాహుల్ ఏమన్నారు? బీజేపీ ఆగ్రహానికి అసలు కారణాలేంటి..?
విదేశీ గడ్డపై నుంచి భారత అంతర్గత వ్యవహారాలపై, ప్రధాని మోదీ పాలనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొలంబియాలోని ఈఐఏ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మాట్లాడుతూ, “భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ ముప్పేట దాడికి గురవుతోంది. ఇదే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం ప్రభుత్వ విమర్శ కాదని, భారత ప్రజాస్వామ్యంపైనే చేసిన దాడి అని అభివర్ణించింది.
బీజేపీ ఎదురుదాడి.. పదునైన విమర్శలు: రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. అధికారం చేజిక్కించుకోలేకపోయిన నైరాశ్యంలో రాహుల్ ఉన్నారని, అందుకే విదేశాలకు వెళ్లి మరీ దేశాన్ని అవమానిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. “భారత్‌లో పూర్తి ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే, మీరు దేశమంతా తిరుగుతూ ప్రధాని మోదీపై నోటికొచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేయగలుగుతున్నారు. ప్రజాస్వామ్యం మీకు ఆ హక్కు ఇచ్చింది. కానీ మీరేమో ఇక్కడ ప్రజాస్వామ్యం లేదంటున్నారు. మీకు ఓట్లు రావడం లేదు, అధికారం కావాలి. దానికోసం విదేశాలకు వెళ్లి దేశాన్ని అవమానిస్తే, ఇప్పుడున్న సీట్లు కూడా ప్రజలు మీకు దక్కకుండా చేస్తారు. ఈ విషయం తెలుసుకోండి,” అని రవిశంకర్ ప్రసాద్ హితవు పలికారు.
స్వాతంత్ర్య సమరయోధులకు అవమానం : “బ్రిటిషర్లు దేశభక్తుల ప్రాణాలు తీసినా, భారత స్వాతంత్య్ర పోరాట యోధులు హింసాత్మకంగా స్పందించలేదు” అని రాహుల్ చేసిన వ్యాఖ్యలను కూడా బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మాటల ద్వారా మంగళ్ పాండే, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి విప్లవ యోధుల త్యాగాలను రాహుల్ అవమానించారని ఆరోపించింది. వారి బలిదానాలను దేశం ఎప్పటికీ మరువదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో మరింత నష్టపోవడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణ బీజేపీ శాఖ కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ, రాజ్యాంగ విలువల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఆయన పదేపదే ప్రయత్నిస్తున్నారని విమర్శించింది.
కొలంబియాలో రాహుల్ ఏమన్నారంటే : ఈఐఏ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ, “భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నాయి. వీరందరికీ ప్రజాస్వామ్య వ్యవస్థ చోటు కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం అదే వ్యవస్థ దాడికి గురవుతోంది. ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే, వృద్ధి ఉంది కానీ అది సేవల రంగంపై ఆధారపడింది. చైనా లాగా మనకు ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగడం లేదు. చైనా అప్రజాస్వామిక వాతావరణంలో ఉత్పత్తి చేస్తే, భారత్ ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉత్పత్తి చేయాలి. అలాంటి వ్యవస్థను నిర్మించడం సవాలుతో కూడుకున్నది,” అని పేర్కొన్నారు.


