Gujarat Elections 2022 : 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ రాష్ట్రంలో రెండు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ లు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా గానీ బీజేపీకి మాత్రం రెబల్‌ల బెడద తలనొప్పిగా మారింది. వారిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కీలక నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన ఏడుగురు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. ఈ నిషేదం ఆరేళ్ల పాటు కొనసాగనుంది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు, క్రమశిక్షణా రాహిత్యం కింద ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ చెప్పారు. సస్పెండ్ అయిన వారిలో హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్‌డా, ఉదయ్ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరుపున పోటీ చేసే 160 మంది అభ్యర్థుల జాబితాను ఇటీవలే బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో 38 కొత్త ముఖాలు ఉన్నాయి. 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వగా.. 42 మందికి మాత్రం నిరాకరించింది. మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌లకు కూడా టికెట్ ఇవ్వలేదు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ జామ్‌నగర్ నార్త్ విధానసభ స్థానం ఆమె పోటీ చేయనుంది.
182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. డిసెంబర్ 1న తొలి దశ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.