భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే ఆయన వారసుడి ఎవరనే దాని సర్వత్రా చర్చనీయాంశమైంది. నడ్డా పదవీకాలం 2024 జూన్‌లో ముగిసినా, కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆలస్యం అవుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పార్టీ కొత్త అధ్యక్షుడిని ఏప్రిల్ చివర్లో లేదా మే ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది.
పార్టీ కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంఘటన) బి.ఎల్. సంతోష్ తదితరులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చలు జరిగాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో.. ప్రస్తుతం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ వంటి నాయకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ నిబంధనల ప్రకారం, జాతీయ అధ్యక్షుడి ఎంపికకు ముందు కనీసం 19 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల నియామకం జరగాలి. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో అధ్యక్షులను నియమించారు.
నడ్డా పదవీకాలం ముగిసినప్పటికీ, ఆయనను పదవిలో కొనసాగించడం పార్టీ లోపలి ఎన్నికల ఆలస్యం కారణంగా జరిగింది. ప్రధాని మోడీ ఏప్రిల్ 22-23 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన తర్వాత కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణలో ఎన్డీఏ మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో, బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికపై అధికారిక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.