Black market scam in IPL ticket: ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే మ్యాచులను ప్రత్యక్షంగా చూసేందుకూ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అభిమానుల ఆసక్తిని ఆసరాగా చేసుకొని కొంతమంది కేటుగాళ్లు ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందాకు తెరలేపారు. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం టికెట్ రేట్లను భారీగా పెంచేయగా.. ఈ బ్లాక్ దందా అందినకాడికి దండుకుంటూ పెద్ద ఎత్తున సొమ్ముచేసుకుంటోంది. కొంతమంది కేటుగాళ్లు నకిలీ యాప్‌లతో అభిమానులను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల విషయంలో ఓ దందా వెలుగులోకి వచ్చింది. ఈ కాంప్లిమెంటరీ టికెట్ల విక్రయాల్లో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఉన్నత స్థాయి అధికారుల పాత్ర ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. దాదాపు 1000 కాంప్లిమెంటరీ టికెట్లను అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని టికెట్లను ఒక్కోటీ రూ. 80 వేలకు విక్రయించి భారీగా మూటగట్టుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దిల్లీ – బెంగళూరు మ్యాచ్‌కు ముందు స్టేడియం వద్దే టికెట్లను బ్లాక్‌లో అమ్ముతూ ఉన్న ముకీమ్, గుర్ఫాన్, ఫైసల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఈ కేసుతో సంబంధమున్న పెట్రోల్ పంప్ ఉద్యోగి పంకజ్ యాదవ్‌నూ అరెస్టు చేశారు.
Also Read: CNG prices hike: వాహనదారులకు బిగ్‌షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధర.. హైదరాబాద్‌లో సెంచరీ..!
కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ..
అయితే, ఈ బ్లాక్ టికెట్ల దందా వెనుక ఢిల్లీ బోర్డు అధికారి కూడా ఉన్నట్లు పోలీసు వర్గాల విచారణలో తేలింది. ఇద్దరు సీనియర్ అధికారులతో సహా నలుగురు డీడీసీఏ సిబ్బందిని రెండు రోజుల కిందట పోలీసులు దాదాపు ఐదు గంటలపాటు విచారించారు. “ఢిల్లీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ స్పెషల్ అట్రాక్షన్. కొహ్లీని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడుతున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ రూ. 80 వేల వరకూ పలికినట్లు తెలిసింది. ఇతర మ్యాచులకు సంబంధించి కూడా బ్లాక్‌లో టికెట్లను అమ్మినట్లు గుర్తించాం’’ అని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఫ్రాంజైజీలే టికెట్లను విక్రయించాలి. టికెట్లలో దాదాపు 10 నుంచి 15 శాతం వరకు లోకల్ అసోసియేషన్‌కు కాంప్లిమెంటరీ పాస్‌ల రూపంలో కేటాయించాలి. ఇప్పుడు ఇదే సదరు రాష్ట్ర సంఘాల్లోని కొందరికి ప్రధాన ఆదాయమార్గంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

