Himalayan tragedy: నేపాల్‌లోని మనాంగ్ జిల్లాలో అక్టోబర్ 20 నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఇద్దరు భారతీయ పర్యాటకుల మృతదేహాలు 3 వారాల తర్వాత అధికారులు గుర్తించారు. మంచులో పూడుకుపోయిన స్థితిలో వారిని గుర్తించారు. భద్రతా దళాలు నిర్వహించిన విస్తృత గాలింపు చర్యల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వీరు మంచు తుఫానులో చిక్కుకుని ప్రాణాలు విడిచి ఉంటారని అధికారులు ప్రాథమికంగా దర్యాప్తులో మరణానికి కారణంగా చెబుతున్నారు.
భారతీయులుగా గుర్తించబడిన తండ్రీకూతుళ్లు గుజరాత్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల జిగ్నేష్ కుమార్ లల్లుభాయ్ పటేల్, 17 ఏళ్ల కుమార్తె ప్రియాన్షా కుమారి పటేల్ గా తేలింది. నేపాల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(APF) అధికారులు వీరి మృతదేహాలను నవంబర్ 9న ఒక కొండ ప్రాంతంలో కనుగొన్నారు. హిరా బహదూర్ జీసీ నేతృత్వంలోని మౌంటెన్ రేస్క్యూ బృందం మలేరిపా మఠం సమీపంలో దాదాపు 100 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో మంచులో కూరుకున్న బాడీలను గుర్తించినట్లు APF డిప్యూటీ సూపరింటెండెంట్ షైలేంద్ర థాపా తెలిపారు.
అక్టోబర్ 20న నిగిస్యాంగ్ గ్రామీణ మున్సిపాలిటీ-4లోని గ్యాల్జెన్ హోటల్ నుంచి బయల్దేరిన ఈ తండ్రీకూతురు.. మలేరిపా మఠాన్ని సందర్శించేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కానీ ఆ రోజుకే వారి మొబైల్ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అనంతరం ఎటువంటి సమాచారం అందలేదు. వారిని సంప్రదించలేకపోవడంతో హోటల్ యాజమాన్యం మనాంగ్ జిల్లాలోని APF మౌంటెన్ రేస్క్యూ శిక్షణ కేంద్రానికి సమాచారం అందించింది. అప్పటి నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది.
ఇక మృతదేహాల రికవరీ ప్రక్రియ రేపటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే అక్టోబర్ నెలలో నేపాల్‌ను బలమైన మంచు తుఫాను తీవ్రంగా ప్రభావితంచేసింది. మనాంగ్ జిల్లాలో మాత్రమే భద్రతా దళాలు 1,500 మందికి పైగా పర్యాటకులను కాపాడాయి. సైక్లోన్ మోంథా ప్రభావం రాకముందే ఈ భారతీయ పర్యాటకులు అదృశ్యమయ్యారు. కానీ హిమాలయాల ఎత్తయిన ప్రాంతాల్లో భారీ మంచు కురిసింది. భారీ మంచు కారణంగా అన్ని ట్రెక్కింగ్ మార్గాలను నేపాల్ ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు బ్లాక్ కావడంతో అనేక మంది చిక్కుకుపోయినట్లు నివేదికలు వెల్లడించాయి.


