John Bolton on Trump’s India policy: అగ్రరాజ్య రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా, జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్, ఇప్పుడు ఆయనపైనే నిప్పులు చెరిగారు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల, పశ్చిమ దేశాల వ్యూహం విఫలమై, భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడ్డాయని ఆయన అన్నారు అసలు బోల్టన్ ఆరోపణల వెనుక ఉన్న వ్యూహాత్మక విశ్లేషణ ఏంటి? ట్రంప్ తీసుకున్న ఏ నిర్ణయాలు ఈ పరిస్థితికి దారితీశాయి?
బుడిదలో పోసిన పన్నీరు : “ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి భారత్‌ను రష్యా ప్రభావం నుంచి బయటకు తీసుకురావడానికి, చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేలా ఢిల్లీని సిద్ధం చేయడానికి పశ్చిమ దేశాలు ఎంతో శ్రమించాయి. కానీ, ట్రంప్ తన వినాశకరమైన సుంకాల విధానంతో ఆ దశాబ్దాల కృషిని ‘బుడిదలో పోసిన పన్నీరు’ చేశారు” అంటూ జాన్ బోల్టన్ తన ‘X’ ఖాతాలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ట్రంప్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, అమెరికా దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రంప్ చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటి : బోల్టన్ విశ్లేషణ ప్రకారం, ట్రంప్ కేవలం తక్షణ ఆర్థిక లాభాల కోసమే పాకులాడారు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో మిత్రదేశాల మనోభావాలను, దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయాలను ఆయన పూర్తిగా విస్మరించారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే కొన్ని వస్తువులపై అధిక సుంకాలు విధించడం ద్వారా అమెరికాకు స్వల్పకాలికంగా కొంత ఆదాయం వచ్చి ఉండవచ్చు. కానీ, ఈ చర్యతో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన భాగస్వామి అయిన భారత్‌ను అమెరికా దూరం చేసుకుంది. ట్రంప్ విధానాలు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఆసియాలో తన పట్టును పెంచుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాయని బోల్టన్ పేర్కొన్నారు.చిన్న ఆర్థిక లాభం కోసం, చైనాను నిలువరించే పెద్ద వ్యూహాత్మక లక్ష్యాన్ని ట్రంప్ బలిపెట్టారని ఆయన విమర్శించారు.
SCO సదస్సు తర్వాతే ఈ వ్యాఖ్యలు : ఇటీవల జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు ముగిసిన వెంటనే బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో ఫలవంతమైన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. “కష్టకాలంలో కూడా భారత్-రష్యా ఒకరికొకరు తోడుగా నిలిచాయి” అని పుతిన్‌తో భేటీలో మోదీ స్పష్టం చేయడం, ఇరు దేశాల మధ్య ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ 15వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని పుతిన్ గుర్తుచేయడం వంటి పరిణామాలు బోల్టన్ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.


