Saturday, November 15, 2025
Homeనేషనల్Bomb Threats: తమిళనాట బాంబుల కలకలం - సీఎం స్టాలిన్, నటి త్రిషలే టార్గెట్!

Bomb Threats: తమిళనాట బాంబుల కలకలం – సీఎం స్టాలిన్, నటి త్రిషలే టార్గెట్!

Tamil Nadu bomb threat : తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం ఆరు రోజుల్లో ఇది మూడోసారి కావడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, ప్రముఖ సినీ నటి త్రిష నివాసాలనే లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. అసలు ఈ వరుస బెదిరింపుల వెనుక ఎవరున్నారు..? ఇది ఆకతాయిల పనా లేక ఏదైనా కుట్ర కోణం ఉందా…?

- Advertisement -

తమిళనాడులో ఆకతాయిల బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, సినీ నటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్‌ను కూడా పేల్చివేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు అందాయి. ఈ సమాచారంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్‌లతో సమస్యాత్మక ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ, చెన్నై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి, ఈ బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు.

వరుస ఘటనలతో అప్రమత్తం: ఇటీవలి కాలంలో తమిళనాడులో ఇలాంటి బెదిరింపులు సర్వసాధారణంగా మారాయి.
చెన్నై విమానాశ్రయం: గురువారం అర్ధరాత్రి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. చెత్త డబ్బాల్లో బాంబులు పెట్టామన్న సమాచారంతో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి, రాత్రంతా విమానాశ్రయాన్ని జల్లెడ పట్టారు. ప్రయాణికుల లగేజీతో సహా ప్రతి అంగుళాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసినా, ఏమీ లభించలేదు.

నటుడు విజయ్ ఇల్లు: కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత, టీవీకే అధినేత, నటుడు విజయ్ నివాసంలో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. పోలీసులు తనిఖీలు చేసి, అది ఉత్తిదే అని తేల్చారు.

10 ప్రాంతాల్లో బెదిరింపులు: గడిచిన నెలలో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం, డీఎంకే మినిస్టర్ పళనివేల్ త్యాగరాజన్ ఇల్లు, నేవీ హోటల్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయంతో సహా 10 ప్రాంతాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఆగస్టులో ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరించిన గణేశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, ఈ బెదిరింపుల పరంపర ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకుని, దీని వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad