Bombay High Court divorce judgment : పవిత్ర బంధానికి ప్రతీకగా భావించే వివాహ వ్యవస్థలో దంపతుల మధ్య తలెత్తే విభేదాలకు చట్టం ఏ విధంగా అద్దం పడుతోంది..? భర్తతో శారీరకంగా కలవడానికి భార్య నిరాకరించడం, నిరాధారమైన అనుమానాలతో నిందలు వేయడం విడాకులకు దారితీస్తుందా..? ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ, దాంపత్య సంబంధాల్లో ‘క్రూరత్వం’ అనే పదానికి బాంబే హైకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యానాన్ని జోడించింది.
విడాకుల కేసులో పుణె ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సహేతుకమైన కారణం లేకుండా భర్తతో శృంగారానికి నిరాకరించడం, తోటి ఉద్యోగులు, స్నేహితుల ముందు అతడిపై వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ నిరాధార ఆరోపణలు చేయడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ కారణాలతో భర్త విడాకులు కోరవచ్చని తీర్పు చెప్పింది.
కేసు పూర్వాపరాలివే: పుణెకు చెందిన ఓ జంటకు 2013లో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొద్ది నెలలకే వారి మధ్య విభేదాలు పొడచూపాయి. భార్య తనతో శారీరకంగా కలవడం లేదని, అంతేకాకుండా తన స్నేహితులు, సహోద్యోగుల వద్ద తనపై అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ అనుమానిస్తూ మానసికంగా వేధిస్తోందని భర్త ఆరోపించాడు. తన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా దివ్యాంగురాలైన తన సోదరిని కూడా ఆమె సరిగా చూసుకోవడం లేదని, పుట్టింటికి వెళ్లిపోయి తనను పట్టించుకోవడమే మానేసిందని వాపోయాడు.
భార్య ప్రవర్తనతో తీవ్ర మానసిక క్షోభకు గురైన భర్త, తనకు విడాకులు మంజూరు చేయాలని 2015లో పుణె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు, భర్త వాదనలతో ఏకీభవిస్తూ విడాకులకు అనుమతించింది.
హైకోర్టులో చుక్కెదురు: ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సదరు మహిళ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనను అత్తమామలు మాత్రమే వేధించారని, భర్తపై తనకు ప్రేమ ఉందని, విడిపోవడం ఇష్టం లేదని పేర్కొంది. తనకు భర్త నుంచి నెలకు లక్ష రూపాయల భరణం ఇప్పించాలని కూడా కోరింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ రేవతి మోహితే డెరే, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, భర్త పట్ల పిటిషనర్ ప్రవర్తించిన తీరు క్రూరంగా ఉందని అభిప్రాయపడింది. “సమాజంలో భర్త గౌరవాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేయడం, దాంపత్య సుఖానికి దూరం పెట్టడం తీవ్రమైన మానసిక వేదనకు గురిచేయడమే” అని వ్యాఖ్యానించింది. ఈ కారణాలు విడాకులు మంజూరు చేయడానికి సరిపోతాయని స్పష్టం చేస్తూ, ఆమె పిటిషన్‌ను కొట్టివేసి, పుణె కోర్టు తీర్పును ఖరారు చేసింది.


