Mumbai Trains Blast Case Update: 2006లో ముంబైలో జరిగిన దారుణమైన రైలు పేలుళ్ల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో, ఈ ఘటనలో నిందితులుగా భావించి శిక్ష విధించిన 12 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ 12 మందిలో మరణశిక్ష పొందినవారు కూడా ఉండటం గమనార్హం. కోర్టు వ్యాఖ్యానంలో పేర్కొన్నట్లు, వీరిపై మోపబడిన ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని స్పష్టం చేసింది. సాక్ష్యాధారాల లేమి, విచారణలో గల లోపాలను దృష్టిలో ఉంచుకొని వారిని న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.
2006 జూలై 11న ముంబై పశ్చిమ రైల్వేలోని సబర్బన్ ట్రైన్‌లలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఉగ్రదాడుల్లో 190 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. దేశాన్ని వణికించిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన మహారాష్ట్ర ఏటీఎస్ (ఆంటీ టెర్రరిజం స్క్వాడ్) 13 మందిని అరెస్ట్ చేసింది. వారిపై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపి, 2015లో వారిని దోషులుగా ప్రకటించింది. ఐదుగురికి ఉరిశిక్ష, మిగిలిన ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ఇందులో ఒకరు 2021లో నాగ్‌పూర్ జైలులో కోవిడ్‌తో మృతి చెందారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/couple-three-children-found-dead-at-home-in-ahmedabad/
తాజా హైకోర్టు తీర్పుతో, ఈ 12 మందిలో ఇప్పటికీ జీవించి ఉన్నవారు ఇప్పుడే జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ తీర్పు, తప్పుడు నిర్బంధాలు, విచారణా లోపాలపై చర్చను మళ్లీ ప్రస్థావనలోకి తెచ్చింది. బాధితుల కుటుంబాలు ఈ నిర్ణయంపై కలవరం వ్యక్తం చేస్తున్నప్పటికీ, న్యాయస్థానం మాత్రం సాక్ష్యాల ఆధారంగానే తుది తీర్పునిచ్చిందని స్పష్టం చేస్తోంది.


