ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి 45 రోజుల పాటు సాగిన మహా కుంభమేళా(Kumbh Mela) బుధవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. సామాన్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇప్పటికే కుంభమేళాకు వచ్చిన భక్తులను ప్రధాని మోదీ(PM Modi) ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఈ కుంభమేళాలో పనిచేసిన పారిశుధ్య, ఆరోగ్య కార్యకర్తలందరికీ శుభవార్త అందించింది యూపీ ప్రభుత్వం. ఈమేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adithyanath) కీలక ప్రకటన చేశారు. కుంభమేళాలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషించిన పారిశుధ్య కార్మికలకు ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.10వేలు బోనస్ ప్రకటించారు. ఏప్రిల్ నెల జీతాలకు సంబంధించి ఉద్యోగుల ఖాతాలో ఈ బోనస్ డబ్బు జమ అవుతుందని తెలిపారు. అలాగే రూ.5లక్షల ఆరోగ్య బీమాను కూడా అందిస్తామన్నారు.
ఇదిలా ఉంటే కుంభమేళా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు బ్రజేష్ పాఠక్, కేపీ మౌర్య, ఇతర మంత్రులు కూడా స్నానాల ఘాట్ల వద్ద స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.