Saturday, November 15, 2025
Homeనేషనల్Bihar Politics: పదవి 47 రోజులే.. ప్రభావం తరతరాలు! 'మండల్' శాసనకర్త బీపీ మండల్...

Bihar Politics: పదవి 47 రోజులే.. ప్రభావం తరతరాలు! ‘మండల్’ శాసనకర్త బీపీ మండల్ కథ!

Mandal Commission OBC reservation : ముఖ్యమంత్రిగా కేవలం 47 రోజులే పాలించిన ఒక నేత, దేశ రాజకీయ గమనాన్ని దశాబ్దాల పాటు ఎలా శాసించగలిగారు? బిహార్‌కు తొలి యాదవ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినా, ఆ గుర్తింపు కంటే బలంగా చరిత్రలో నిలిచిపోయేలా ఆయన ఏం చేశారు? ఆయనే బిందేశ్వరి ప్రసాద్ మండల్, అలియాస్ బీపీ మండల్. సీఎం కుర్చీలో కూర్చున్నది కొద్దికాలమే అయినా, ఆయన పేరుతో వచ్చిన ఒక కమిషన్ నివేదిక భారత సమాజాన్ని, రాజకీయాలను శాశ్వతంగా మార్చేసింది. ఎవరీ బీపీ మండల్? ఏంటా కథ?

- Advertisement -

యాదవ శక్తి.. ముఖ్యమంత్రి పీఠం : 1968, అది బిహార్ రాజకీయాల్లో ఒక సంధియుగం. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండిపడి, సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలైన రోజులవి. ఆ సమయంలో, సోషలిస్ట్ యోధుడు రామ్ మనోహర్ లోహియా అనుచరుడిగా, యాదవ వర్గంలో బలమైన నేతగా ఎదుగుతున్నారు బీపీ మండల్. లోహియాతో విభేదించి ‘శోషిత్ దళ్’ అనే సొంత పార్టీని స్థాపించారు.

అప్పటి నిబంధనల ప్రకారం ఎంపీగా ఉన్న వ్యక్తి నేరుగా సీఎం కాలేరు. దీంతో, తన పార్టీకే చెందిన మరో ఓబీసీ నేత సతీశ్ ప్రసాద్ సింగ్‌ను కేవలం ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రిని చేసి, తాను శాసనమండలికి నామినేట్ అయ్యేలా వ్యూహం పన్నారు. ఆ తర్వాత, 1968 ఫిబ్రవరి 1న, బీపీ మండల్ బిహార్ ఏడవ ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి తొలి యాదవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన మిత్రపక్షాలను సంతృప్తి పరిచేందుకు, కేవలం 10 రోజుల్లోనే తన మంత్రివర్గాన్ని 38 మందికి విస్తరించారు. ఇది అప్పటి బిహార్ చరిత్రలోనే అతిపెద్ద మంత్రివర్గం.

కుప్పకూలిన సంకీర్ణం : అయితే, వివిధ పార్టీల కలయికతో ఏర్పడిన ఆ సంకీర్ణ ప్రభుత్వం నిలదొక్కుకోలేకపోయింది. కాంగ్రెస్‌లోని అసమ్మతి వర్గం, ఇతర మిత్రపక్షాలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడంతో, కేవలం 47 రోజులకే మండల్ ప్రభుత్వం కుప్పకూలింది.

మండల్ కమిషన్.. ఒక చారిత్రాత్మక మలుపు : ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం తక్కువే అయినా, చరిత్ర బీపీ మండల్‌ను మరో రూపంలో గుర్తుపెట్టుకుంది. 1979లో, మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం, దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (OBC) స్థితిగతులను అధ్యయనం చేయడానికి రెండవ ఓబీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌కు ఛైర్మన్‌గా బీపీ మండల్‌ను నియమించింది. అదే నేడు మనం పిలుచుకుంటున్న “మండల్ కమిషన్”.ఈ కమిషన్ 1980లో తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలోని అత్యంత కీలకమైన సిఫారసు – ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించడం.
ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను పక్కన పెట్టినా, 1990లో ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతంలో తీవ్ర ఆందోళనలకు, రాజకీయ ప్రకంపనలకు దారితీసింది.

అగ్రవర్ణాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా, ఈ నిర్ణయం ఓబీసీల రాజకీయ చైతన్యానికి, ఆత్మగౌరవానికి పునాది వేసింది. భారత రాజకీయాల్లో ‘మండల్’ ఒక శకంగా, ఒక రాజకీయ సమీకరణంగా నిలిచిపోయింది. సీఎంగా అతి తక్కువ కాలం పనిచేసినా, ఒక కమిషన్ ఛైర్మన్‌గా బీపీ మండల్ దేశ రాజకీయాలపై, సామాజిక న్యాయంపై వేసిన ముద్ర శాశ్వతమైనది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad