- వ్యాపార చెల్లింపులపై 0.4% రుసుము
- అక్టోబర్ 15 నుంచి నుంచి కొత్త విధానం
- రూ.75 వేలపైన గరిష్ఠంగా రూ.300
- వ్యక్తిగత చెల్లింపులకు నో ఛార్జీ
- వినియోగదారులపై భారం వేయొద్దని బ్యాంకులకు కేంద్రం ఆదేశం
- చిన్న వ్యాపారాలకు ఊరట.. నెలకు రూ.లక్ష వరకు జీరో ఎండీఆర్
- మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ బ్రోకర్లకు 0.02 శాతం
- టెలికాం, బీమా, ఇంధన రంగాలకు లావాదేవీకి రూ.5 ఫ్లాట్ ఛార్జీ
- యూపీఐపై ‘మోదీ ట్యాక్స్: కాంగ్రెస్
- కాంగ్రెస్ అబద్ధాల దుకాణం.. వినియోగదారులపై ఛార్జీ లేదు: బీజేపీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15(తెలుగుప్రభ): రూ.2 వేలకుపైగా వ్యాపారులకు (పర్సన్ టు మర్చంట్) చేసే యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం అక్టోబర్ 15, 2026 నుంచి అమల్లోకి రానుంది. అయితే రూ.2 వేల వరకు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఎండీఆర్ ఉండదు. వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) చేసే చెల్లింపులపై లావాదేవీ విలువతో సంబంధం లేకుండా ఎలాంటి ఛార్జీ ఉండదు. రూ.2 వేలకుపైగా వ్యాపార లావాదేవీలకు 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.3 వేల విలువైన కొనుగోలుపై వ్యాపారి తన అకౌరింగ్ బ్యాంకుకు రూ.12 ఎండీఆర్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కమీషన్ బ్యాంకులతో పాటు చెల్లింపుల వ్యవస్థలోని ఇతర భాగస్వాములకు పంపిణీ అవుతుంది. రూ.75 వేలకుపైగా అధిక విలువైన చెల్లింపులపై ఎండీఆర్ గరిష్ఠంగా రూ.300కే పరిమితం చేశారు. టెలికాం, బీమా, ఇంధన రంగాలకు లావాదేవీకి రూ.5 చొప్పున ఫ్లాట్ ఎండీఆర్ విధిస్తారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ బ్రోకర్లకు 0.02 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. దీనికీ ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది. నెలకు రూ.లక్ష వరకు స్వీకరించే చిన్న వ్యాపారుల అన్ని లావాదేవీలపైనా తప్పనిసరిగా జీరో ఎండీఆర్ అమలు చేయనున్నారు.
వినియోగదారులపై భారం పడకుండా
యూపీఐ యాప్ ప్రొవైడర్లు ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా దాచిన ఛార్జీలు వసూలు చేయకుండా నిషేధం విధించారు. ఎండీఆర్ భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత యూపీఐ వినియోగదారులకు ఉచిత లావాదేవీలపై నెలవారీ కోటా, పరిమాణ పరిమితి లేదా టైర్డ్ క్యాప్‌లు ఉండవు. అయితే బ్యాంకులు, ఎన్‌పీసీఐ ఆయా కేటగిరీలను బట్టి రోజువారీ లావాదేవీ పరిమితులను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అమలు చేయనున్నాయి.
చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం
చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం వసూలయ్యే మొత్తం ఎండీఆర్‌లో 5శాతం నిధికి కేటాయిస్తారు. ఎండీఆర్ అమలుతో మొత్తం వ్యాపార లావాదేవీల్లో కేవలం 4శాతం మాత్రమే ప్రభావితమవుతాయని ప్రభుత్వం పేర్కొంది. తుది ఎండీఆర్ విధానం, పరిమితుల నిర్మాణం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి.
అమెరికా ఒత్తిడికి ప్రధాని లొంగిపోయారు: రాహుల్
రూ.2 వేలకుపైగా వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపుపై కాంగ్రెస్ ‘మోడీ ట్యాక్స్’గా అభివర్ణించగా.. అమెరికా ఒత్తిడికి ‘రాజీ పడిన ప్రధాని మోదీ మరోసారి లొంగిపోయారని’ రాహుల్ గాంధీ ఆరోపించారు. యూపీఐపై ఫీజులు విధించేందుకు మోడీ ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని ఆరోపించారు. రూ.2 వేలకుపైగా లావాదేవీలు పరిమాణంలో కేవలం 5 శాతమే అయినా, మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. వ్యాపారులపై పడే ఎండీఆర్ భారాన్ని చివరకు వస్తువుల ధరల రూపంలో వినియోగదారులే భరించాల్సి వస్తుందని అన్నారు. అమెరికా చెల్లింపు సంస్థలు భారత్‌లోని జీరో ఎండీఆర్ విధానాన్ని చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయని, వాణిజ్య ఒప్పందం విషయంలో మాదిరిగానే ప్రధాని అమెరికా ఒత్తిడికి లొంగారని ఆరోపించారు.
డిజిటల్ చెల్లింపులపై కొత్త భారం: ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘మోదీ ప్రభుత్వ లూటీ ఇప్పుడు యూపీఐకి చేరింది’ అని విమర్శించారు. ద్రవ్యోల్బణంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్న సమయంలో ‘డిజిటల్ పేమెంట్స్ ట్యాక్స్’ విధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నోట్ల రద్దు సమయంలో డిజిటల్, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు డిజిటల్ చెల్లింపులపై కొత్త భారాన్ని మోపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఎండీఆర్‌ను ‘మోదీ ట్యాక్స్’గా అభివర్ణించారు.
డిజిటల్ ఇండియాను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. యూపీఐ ఛార్జీలపై తప్పుడు ప్రచారంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, డిజిటల్ ఇండియాను దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. రూ.2 వేల వరకు జరిగే 96 శాతం పీ2ఎం లావాదేవీలు పూర్తిగా ఉచితమని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు చేసే పీ2పీ బదిలీలపైనా ఎలాంటి ఛార్జీ లేదని తెలిపారు. జైరాం రమేశ్ మాత్రం ఆగస్టు 6న ‘ఎండీఆర్‌పై నిర్ణయం తీసుకోలేదు’, ఆగస్టు 10న పార్లమెంటులో ‘ఎండీఆర్ విధానం ఇంకా ఖరారు కాలేదు’ అని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. సెప్టెంబర్ 14న నోటిఫికేషన్ జారీ చేసి 24 గంటల్లోనే ఎండీఆర్ ప్రవేశపెట్టిందని విమర్శించారు.

