Homeనేషనల్CM Vijay: ఈఎంఐ తరహాలో లంచాల వసూళ్లు.. డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

CM Vijay: ఈఎంఐ తరహాలో లంచాల వసూళ్లు.. డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

చెన్నై, సెప్టెంబర్‌ 7 (తెలుగుప్రభ): తమిళనాడు శాసనసభ వేదికగా ప్రతిపక్ష డీఎంకే పార్టీపై రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బ్యాంకు రుణాలకు ఈఎంఐలు చెల్లించినట్లుగా, గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు వాయిదాల పద్ధతిలో లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చిందని ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. ఈడీ రూపొందించిన నివేదికల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సభలో పోలీసు శాఖ పద్దులపై జరిగిన చర్చలో సీఎం విజయ్ మాట్లాడుతూ… “గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ విలువలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు పార్టీ నిధుల పేరుతో వసూలు చేశారని ఈడీ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ అధికారుల ద్వారా సేకరించిన లంచాలు. ఈ వసూళ్ల సొమ్ముకు ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తదితర ముఖ్య నేతలే ప్రత్యక్ష లబ్ధిదారులు” అని ఆరోపించారు.

- Advertisement -

‘కరూర్ గ్యాంగ్’ వ్యవస్థీకృత అవినీతి

టాస్మాక్ మద్యం బార్ల యజమానుల నుంచి రాజకీయ నాయకులు డబ్బు వసూలు చేయడాన్ని ఈడీ తన నివేదికలో ‘కరూర్ గ్యాంగ్’గా సంబోధించిందని విజయ్ గుర్తుచేశారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరును ప్రస్తావిస్తూ… ఆయన ఈ వ్యవస్థీకృత అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారన్నారు. “కరూర్ గ్యాంగ్.. ఎంత గొప్ప పేరు ఇది! అసలు ఈ ముఠాకు నాయకుడు ఎవరు? అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీఎంకే ఉన్నచోటల్లా అక్రమాలు జరుగుతాయి” అని వ్యాఖ్యానించారు.

ద్వంద్వార్థాలు వచ్చేలా కొందరి మాటలు
ఇటీవల నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసినట్లుగా భావిస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యల వివాదంపై సీఎం విజయ్ పరోక్షంగా స్పందించారు. “సభలో లేదా బయట కొందరు ద్వంద్వార్థాలువచ్చేలా మాట్లాడుతున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ ఉంది కదా అని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చట్టం చూస్తూ ఊరుకోదు. మనందరి ఇళ్లలోనూ తల్లి, అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఇదే అసెంబ్లీలో మాజీ సీఎం జయలలిత గారు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో మనమంతా చూశాం. అలాంటి సంస్కృతిని ఉపేక్షించబోం” అని హెచ్చరించారు.

సభ నుంచి డీఎంకే వాకౌట్

ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎంకే సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ ఆరోపణలను డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అసలైన సమస్యలపై సమాధానం చెప్పలేక, ప్రజల దృష్టిని మరల్చడానికే సీఎం విజయ్ లేనిపోని నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News