Raghvendra Singh Controversial Comments: ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఒక హిందూ యువకుడు ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, తాను ఆ పెళ్లిని జరిపించి, వారికి ఉపాధి కూడా కల్పిస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తినా, ఆయన తన ప్రకటనను సమర్థించుకున్నారు.
’10 మంది అమ్మాయిలను తీసుకురండి’
సిద్ధార్థ్‌నగర్ జిల్లాలోని డుమరియాగంజ్ మాజీ ఎమ్మెల్యే అయిన రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, తన నియోజకవర్గంలోని ధన్‌కర్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఇద్దరు హిందూ మహిళలను ముస్లిం యువకులు బలవంతంగా పెళ్లి చేసుకుని, మతం మార్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియోలో సింగ్ మాట్లాడుతూ, “ఇద్దరు హిందూ అమ్మాయిలకు బదులుగా, కనీసం 10 మంది ముస్లిం అమ్మాయిలను హిందూ యువకులు తీసుకువచ్చి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి బాధ్యతలతో పాటు, వారికి ఉద్యోగం కూడా నేనే ఏర్పాటు చేస్తాను. ఇది అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ అధినేత) కాలం కాదు. మీరు భయపడాల్సిన పనిలేదు, మేము మీకు అండగా ఉంటాం” అని పేర్కొన్నారు.
‘యోగీజీ పాలన’ అని సమర్థన
తన వివాదాస్పద వ్యాఖ్యలపై అడిగినప్పుడు, మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర సింగ్ ఎటువంటి పశ్చాత్తాపం చూపలేదు. డుమరియాగంజ్ ప్రాంతాన్ని గతంలో ‘మినీ పాకిస్తాన్’ అని పిలిచేవారని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆ అరాచక పాలన అదుపులోకి వచ్చిందని ఆయన అన్నారు.
“ఇద్దరు హిందూ అమ్మాయిలను తీసుకుపోతే, మీరు పది మంది ముస్లిం అమ్మాయిలను తీసుకురండి. వివాహ ఖర్చులతో పాటు, వారి భద్రతకు కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం. ఇది ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు చేసే అఖిలేష్ యుగం కాదు. ఇది యోగీజీ యుగం. మీరు దేనికీ భయపడకుండా, మీకు నచ్చినది చేయండి, మేము మీకు మద్దతుగా ఉంటాం” అని ఆయన గట్టిగా చెప్పారు.
భగ్గుమన్న సమాజ్‌వాదీ పార్టీ
రాఘవేంద్ర సింగ్ వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీవ్రంగా ఖండించింది. డుమరియాగంజ్ ఎస్పీ ఎమ్మెల్యే సయ్యదా ఖాటూన్ మాట్లాడుతూ, “రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన ప్రకటనలు మహిళలను అవమానించడమే. వారు ముస్లింలను నిరంతరం అవమానిస్తున్నారు. ఈ దేశం కోసం ముస్లింలు ప్రాణత్యాగం చేయలేదా? నేను ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు. పరిపాలన యంత్రాంగం చూస్తూ ఊరుకుంటోంది. ఏదైనా జరిగితే దానికి బాధ్యత ప్రభుత్వానిదే” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమని ఎస్పీ ఆరోపించింది.
ALSO READ: Asaram Bapu Medical Bail: బాలికపై అత్యాచార దోషి ఆసారాం బాపుకు 6 నెలల బెయిల్.. ఏడాదిలో నాలుగోసారి


