Brother and sister reunite after 60 years : విధి ఆడే వింత నాటకంలో ఓ అన్నా చెల్లెలి అనుబంధం గెలిచింది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ వియోగానికి రక్షాబంధన్ పవిత్ర బంధం శుభం కార్డు వేసింది. తొమ్మిదేళ్ల పసి ప్రాయంలో జనసంద్రంలో కలిసిపోయి, కన్నవారికి దూరమైన ఓ చెల్లెలు, 69 ఏళ్ల వయసులో తన అన్నను చేరుకుంది. ఈ అపురూప కలయికతో ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇంతకీ, అరవై ఏళ్ల క్రితం ఏం జరిగింది..? గంగా తీరంలో తప్పిపోయిన ఆ బాలిక కథ ఏయే మలుపులు తిరిగింది..? ఆమెను తిరిగి సొంత గూటికి చేర్చిన ఆ ప్రయత్నం వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలేంటి…?
కన్నీళ్లతో తడిసిన ఓ అపురూప గాథ : ఇది ఏ సినిమా కథో కాదు, కన్నీళ్లను సైతం కరిగించే ఓ నిజ జీవిత గాథ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్న అన్నాచెల్లెళ్ల మధ్య అరవై ఏళ్ల పాటు అడ్డుగోడగా నిలిచిన దూరాన్ని, వారి అనుబంధం, మనవడి పట్టుదల చెరిపివేశాయి.
అరవై ఏళ్ల కిందట… గంగా తీరాన విషాదం : ఈ కథ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా కభోర్ గ్రామంలో మొదలైంది. సుమారు 60 ఏళ్ల క్రితం, భగవాన్ సింగ్ అనే వ్యక్తి తన తొమ్మిదేళ్ల కుమార్తె బాలేశ్ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు గంగామేళాకు కుటుంబంతో సహా వెళ్లాడు. గంగా నదిలో పుణ్యస్నానం చేయిస్తున్న సమయంలో, ఆ జనసందోహంలో బాలేశ్ తండ్రి చేయి విడిచి తప్పిపోయింది. కన్నకూతురి కోసం భగవాన్ సింగ్ నదీ తీరాన్నంతా జల్లెడ పట్టినా ప్రయోజనం లేకపోయింది. గుండె చెరువైన ఆ తండ్రి, బిడ్డ దొరకదనే నిరాశతో భారంగా ఇంటికి తిరిగివచ్చాడు.
అపరిచితురాలి వలలో… కొత్త జీవితం : మరోవైపు, తల్లిదండ్రుల కోసం ఒంటరిగా ఏడుస్తున్న బాలేశ్‌ను ఓ వృద్ధురాలు చేరదీసింది. “నేను మీ చిన్నమ్మను, ఇంటి దగ్గర దింపుతా” అని నమ్మబలికి, కారులో ఎక్కించుకుంది. అయితే, దారిలో తన తండ్రి కారును గుర్తించిన బాలేశ్ కారు దిగిపోయే ప్రయత్నం చేసింది. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులను పిలిచి, ఈ పాప తన కూతురేనని, మాట వినడం లేదని అబద్ధం చెప్పింది. ఆమె మాటలు నమ్మిన పోలీసులు, బాలేశ్‌ను తిరిగి అదే కారులో ఎక్కించారు. ఆ వృద్ధురాలు బాలేశ్‌ను ఫరూఖాబాద్‌లోని మరో మహిళకు అప్పగించింది. ఆమే బాలేశ్‌ను పెంచి పెద్ద చేసి, ఐదేళ్ల తర్వాత తన సోదరుడికి ఇచ్చి వివాహం జరిపించింది. పెళ్లైన తర్వాత కూడా బాలేశ్ తన పుట్టింటి గురించి, కభోర్ గ్రామం గురించి భర్తకు చెబుతూనే ఉన్నా, ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
నానమ్మ ఆవేదన… మనవడి సంకల్పం : కాలం గడిచిపోయింది. బాలేశ్‌కు 69 ఏళ్లు వచ్చాయి. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయినా తన వాళ్లను కలవాలన్న తపన ఆమెలో చావలేదు. తన నానమ్మ ఆవేదనను అర్థం చేసుకున్న ఆమె మనవడు, సైన్యంలో పనిచేస్తున్న ప్రశాంత్, ఎలాగైనా ఆమెను పుట్టింటి వారితో కలపాలని నిశ్చయించుకున్నాడు.
కీలక మలుపు… ఆచూకీ చెప్పిన ఆనవాళ్లు : నానమ్మ చెప్పిన వివరాలతో ప్రశాంత్ ఆగస్టు 3న కభోర్ గ్రామానికి చేరుకున్నాడు. గ్రామ పెద్దలను కలిసి 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన పాప గురించి ఆరా తీశాడు. వారు ఓ ఇంటిని చూపించగా, అక్కడ బాలేశ్ అన్న కొడుకు (ఆమె మనవడు) కనిపించాడు. ప్రశాంత్ జరిగిన కథంతా వివరించి, తన నానమ్మ బాలేశ్‌కు వీడియో కాల్ చేశాడు. ఫోన్‌లో బాలేశ్, తన చిన్ననాటి జ్ఞాపకాలైన ఇంట్లోని “శ్యామా ఆవు”, ధాన్యం దంచే “క్రషర్”, పెరట్లోని చెట్ల గురించి అడగడంతో, ఆమె 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన అత్తే అని అతను నిర్ధారించుకున్నాడు. వెంటనే ఈ శుభవార్తను తన తండ్రికి (బాలేశ్ అన్నయ్యకు) చేరవేశాడు.
రాఖీ పండుగనాడు పుట్టింట అడుగు : చెల్లెలి ఆచూకీ తెలియగానే, ఆ అన్నయ్య ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కుటుంబంతో కలిసి హుటాహుటిన ఫరూఖాబాద్ వెళ్లి, తన చెల్లెలు బాలేశ్‌ను రాఖీ పండుగ కోసం సొంతూరైన కభోర్‌కు తోడ్కొని వచ్చాడు. మొత్తం ఎనిమిది మంది తోబుట్టువులలో ఏకైక సోదరుడిని, మిగిలిన చెల్లెళ్లను కలుసుకున్న బాలేశ్ ఆనందభాష్పాలతో ఉప్పొంగిపోయింది. అరవై ఏళ్ల తర్వాత, రక్షాబంధన్ వేళ, తన అన్నయ్య చేతికి రాఖీ కట్టి ఆశీర్వాదం అందుకుంది. ఈ అపురూప కలయిక ఆ రెండు కుటుంబాలకు ఈ రక్షాబంధన్‌ను చిరస్మరణీయం చేసింది.


