భారతదేశం గత వైభవాన్ని సాధించేందుకు ప్రజలంతా తమ శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తే రానున్న 25 ఏళ్లలో అది సాకారం అవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అందుకే ఈ 25 ఏళ్ల కాలం అత్యంత కీలకమైన అమృత కాలం అంటూ ఆమె వివరించారు. సుస్థిరమైన, నిర్ణయాత్మకమైన, నిర్భయమైన సర్కారు కేంద్రంలో ఉందన్నారు. అవినీతి, ఆదివాసీలు, మహిళా సాధికారత వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడుతోందని రాష్ట్రపతి ప్రసంగంలో ద్రౌపది పేర్కొన్నారు.
ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైందని రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారు. ఇండియన్ డిజిటల్ నెట్ వర్క్ ప్రపంచానికి మార్గం చూపేలా ఉందని ద్రౌపది ముర్ము వెల్లడించారు. మనదేశం ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తోందని ఆమె కొనియాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ద్రౌపదీ ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉండిపోయారు. భారత్ జోడో యాత్ర ముగింపు సమావేశాల్లో భాగంగా కశ్మీర్ లో నిన్నంతా ఉండిపోయిన వీరు విమాన సర్వీసులు ఆలస్యం కావటంతో సభకు హాజరు కాలేకపోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రకటించింది. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వేను సభలో ప్రవేశపెట్టారు.