C. P. Radhakrishnan takes oath as 15th Vice-President of India: భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. ఇక, ఎన్‌డీఏ కూటమిలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్, వెంకయ్యనాయుడు సైతం హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉప రాష్ట్రపతులనూ సైతం ఆహ్వానించారు. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగానూ, రాజ్యసభ ఛైర్మన్‌గానూ కొనసాగనున్నారు. కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన సమీప ప్రత్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తికావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు.
President Droupadi Murmu administers the Oath of Office to Vice President-elect C.P. Radhakrishnan.
(Pic Source: DD) pic.twitter.com/jO964aMt3t
— ANI (@ANI) September 12, 2025
మెజారిటీ ఉన్నప్పటికీ తప్పని పోటీ..
కాగా, వ్యక్తిగత కారణాలతో జులై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. ఆ రోజు ఉదయమంతా రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన.. రాత్రికల్లా అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి దిగిపోతున్నట్లు తెలిపారు. అయితే, నోట్ల కట్టల కేసుకు సంబంధించిన జస్టిస్ యశ్వంత్‌వర్మ అభిశంసన వ్యవహారంలో కేంద్రంతో విభేదాలు రావడం వల్లే ఆయన వైదొలిగినట్లు విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఏకగ్రీవం అవుతుందని బీజేపీ ఆశించింది. అందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కూడా కోరింది. కానీ.. ఇండియా కూటమి తమవైపు నుంచి జప్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టడంతో బీజేపీకి పోరాటం తప్పలేదు.
రాధాకృష్ణన్ ప్రొఫైల్ ఇదే..
సీపీ రాధాకృష్ణన్‌కి 68 ఏళ్లు. తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 మే 4న పుట్టారు. ఆయన తన యంగ్ ఏజ్ నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో క్రమంగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998, 1999 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2003 నుంచి 2006 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర గవర్నర్‌గా వివిధ రాష్ట్రాల్లో సేవలందించారు. వ్యవసాయవేత్త, పారిశ్రామికవేత్త అయిన ఆయన… సమాజ సేవ, పేదల సాధికారతకు కృషి చేశారు. ఆయన విద్యాభ్యాసం గమనిస్తే…. వి.ఓ. చిదంబరం కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చేశారు.


