Union Cabinet Approval 8th Pay Commission: దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర కేబినెట్ శుభవార్త అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం 8వ కేంద్ర వేతన కమిషన్ (సీపీసీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, 69 లక్షల మంది పెన్షనర్లకు పింఛన్లు పెరిగే అవకాశం ఉంది.
జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలో కమిషన్: కేంద్ర మంత్రివర్గ సమావేశం 8వ కేంద్ర వేతన కమిషన్ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నియమించింది. జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అంతే కాకుండా గతంలో జమ్మూకశ్మీర్ పునర్విభజన కమిషన్ ఛైర్మన్‌గా, ఉత్తరాఖండ్ యూసీసీ ముసాయిదా కమిటీలోనూ పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆమెకు అప్పగించిన నాలుగో అతిపెద్ద బాధ్యత ఇది. 8వ కేంద్ర వేతన కమిషన్ సభ్యులుగా బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ పులక్ ఘోష్ తాత్కాలిక సభ్యుడిగా, పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సభ్యకార్యదర్శిగా నియమితులయ్యారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్య నిర్ణయం: కేంద్రం ఈ ఏడాది జనవరిలోనే 8వ సీపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ కమిషన్ సభ్యులను, ఛైర్మన్‌ను నియమించలేదు. అయితే కమిషన్ ఏర్పాటు చేసిన తేదీ నుంచి 18 నెలల్లోగా తన సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులు వచ్చే ఏడాది (2026 జనవరి 1 నుండి) అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కమిషన్ పరిశీలించాల్సిన కీలక అంశాలు: దేశ ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి వ్యయం, సంక్షేమ పథకాలకు వనరుల లభ్యతను పరిశీలించాల్సి ఉంటుంది. సహకారేతర పెన్షన్ పథకాలకు నిధులు, ఖర్చులను అంచనా వేయాలి. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా ప్రైవేట్ రంగ ఉద్యోగుల ప్రస్తుత జీతాలను పరిశీలించాలి. వాటి పని విధానాన్ని సైతం పరిశీలించాల్సి ఉంటుంది. ఈ అంశాలపై తుది సిఫార్సులతో పాటుగా.. అవసరమైనప్పుడు మధ్యంతర నివేదికలను కూడా సమర్పించే వెసులుబాటు కమిషన్‌కు ఉంది. కాగా.. చివరిసారిగా 7వ వేతన కమిషన్ సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.


