Shashi Tharoor on Trump’s Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన టారిఫ్‌లపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తీవ్రంగా స్పందించారు. ఒకరి ఆదేశాలను గుడ్డిగా పాటించే వలసవాద మనస్తత్వాన్ని భారత్ అంగీకరించబోదని, ఆ 200 ఏళ్ల వలసపాలన రోజులు ముగిశాయని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రంప్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటాన్ని తప్పుబడుతూ సుంకాలు విధిస్తున్న అమెరికా ఇదే సమయంలో బిలియన్ల డాలర్ల విలువైన ఎరువులను రష్యా నుంచి ఎలా దిగుమతి చేసుకుంటోందని ప్రశ్నించారు.
మనల్ని ఎవరూ బెదిరించలేరు..
ట్రంప్ చర్యలు భారత్‌కు ఏమాత్రం మంచివి కావని, దీనివల్ల అమెరికాలో భారత వస్తువులు ఖరీదుగా మారి మన ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మనపై 50% సుంకాలు విధిస్తే, మనం కూడా అమెరికా వస్తువులపై అంతేస్థాయిలో సుంకాలు విధించాలని, మనల్ని ఎవరూ బెదిరించలేరని స్పష్టం చేశారు.
మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అమెరికా గౌరవించడం లేదా అని థరూర్ ప్రశ్నించారు. భారత్ వారికి ముఖ్యం కానప్పుడు, వారు కూడా మనకు ముఖ్యం కానక్కర్లేదని అన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం మన జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.


