కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జనగణనతో పాటు కులగణన(Caste survey) చేస్తామని ప్రకటించింది. ఈమేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయని తెలిపారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల కులగణన చేపట్టారని విమర్శించారు.
దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను పారదర్శకంగా చేపట్టాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. ఏప్రిల్ 2020లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కొవిడ్ కారణంగా వాయిదా పడిందన్నారు. కులగణన నిర్ణయంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.