Friday, December 12, 2025
Homeనేషనల్Sericulture : ఆకులో అదృష్టం.. ఆముదంతో పట్టుబట్ట! రైతుకు రెట్టింపు ఆదాయం ఖాయం!

Sericulture : ఆకులో అదృష్టం.. ఆముదంతో పట్టుబట్ట! రైతుకు రెట్టింపు ఆదాయం ఖాయం!

Sericulture with castor leaves : పొలంలోని ప్రతీది రైతుకు సిరినిచ్చేదేనని పెద్దలు ఊరికే అనలేదు. ‘కాదేదీ ఆదాయానికి అనర్హం’ అన్న నానుడిని అక్షరాలా నిజం చేస్తూ, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఓ అద్భుత ఆవిష్కరణకు తెరలేపారు. ఇప్పటివరకు ఆముదం పంటలో గింజలు మాత్రమే అమ్ముకుని, ఆకులను పనికిరావని పశువులకో, చెత్తకుప్పలకో వేస్తున్న రైతులకు ఇది నిజంగా శుభవార్తే. ఇకపై ఆ పనికిరాని ఆకే రైతు ఇంట ఆకుపచ్చని బంగారం పండించనుంది. 

- Advertisement -

ఆముదం సాగు చేసే రైతుల తలరాతను మార్చే అద్భుతమైన పరిశోధనకు గుజరాత్‌లోని సర్దార్‌కృష్ణినగర్ దాంతీవాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికైంది. కేవలం గింజలపైనే ఆధారపడకుండా, ఆముదం మొక్కలోని ప్రతి భాగంతోనూ రైతు లాభాలు గడించాలన్న వారి సుదీర్ఘ అన్వేషణ, ఇప్పుడు సెరీకల్చర్ (పట్టు పురుగుల పెంపకం) రూపంలో ఫలించింది.

అసోం పర్యటనలో అంకురార్పణ
సమస్య నుంచి పరిష్కారం వైపు: గుజరాత్‌లోని బనస్‌కాంత, సబర్‌కాంత వంటి జిల్లాల్లో ఆముదం సాగు అధికం. అయితే, దిగుబడి వచ్చాక గింజలు అమ్ముకోగా, మిగిలిన ఆకులు వృథా కావడం శాస్త్రవేత్తలను ఆలోచింపజేసింది. ఈ వృథాను ఆదాయంగా మార్చే మార్గాలపై పరిశోధన చేస్తున్న దాంతీవాడ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం, అధ్యయనంలో భాగంగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పర్యటించింది.

అక్కడి ఆచారం.. ఇక్కడ ఆవిష్కరణ: అసోంలోని సెరీకల్చర్ కేంద్రాలను సందర్శించినప్పుడు వారిని ఓ ఆసక్తికర దృశ్యం ఆకర్షించింది. అక్కడ పట్టు పురుగులకు (బాంబిక్స్ మోరి జాతికి చెందినవి) సాధారణంగా మల్బరీ ఆకులకు బదులుగా, ఆముదం ఆకులను ఆహారంగా అందించడం గమనించారు. ఆశ్చర్యంతో అక్కడి రైతులను ఆరా తీయగా, కీలకమైన విషయం తెలిసింది. ఆముదం ఆకులను తిన్న పట్టు పురుగులు అత్యంత నాణ్యమైన, దృఢమైన పట్టును ఇస్తున్నాయని, దీనివల్ల తమకు మంచి గిరాకీ లభిస్తోందని వారు తెలిపారు.

గుజరాత్‌కు వరంగా మారిన ఆలోచన: ఈ విషయం విన్న శాస్త్రవేత్తల బృందానికి ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆముదం సాగు విస్తారంగా ఉన్న తమ గుజరాత్ రైతులకు ఈ పద్ధతి ఒక వరంలా మారుతుందని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయగలదని గుర్తించారు.

ప్రయోగశాలలో పరిశోధన.. ఫలితాలు అమోఘం : వెంటనే రంగంలోకి దిగిన శాస్త్రవేత్తల బృందం, ఆముదం ఆకులు తిన్న పట్టు పురుగులు పెట్టిన గుడ్లను సేకరించి, దాంతీవాడ విశ్వవిద్యాలయంలోని తమ ప్రయోగశాలకు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేకమైన వాతావరణంలో వాటిని పొదిగించి, వాటికి ఆముదం ఆకులనే ఆహారంగా అందించి పరిశీలించారు. ఫలితాలు అత్యంత ఆశాజనకంగా వచ్చాయి.

నాణ్యమైన పట్టు ఉత్పత్తి: ల్యాబ్‌లో పెంచిన గొంగళి పురుగులు అత్యుత్తమ నాణ్యత కలిగిన పట్టుగూళ్లను నిర్మించడాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరించుకున్నారు.
ఆదాయం రెట్టింపు లెక్క: మార్కెట్‌లో ఈ రకమైన అత్యుత్తమ నాణ్యత కలిగిన పట్టుకు కిలోకు సుమారు రూ.300 వరకు ధర పలుకుతోంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఒక రైతు తనకున్న నాలుగెకరాల ఆముదం పంటలో కేవలం 25 నుంచి 30 శాతం ఆకులను మాత్రమే పట్టు పురుగుల పెంపకానికి వాడితే చాలు. దీని ద్వారా వచ్చే ఆదాయం, ఆముదం గింజల ద్వారా వచ్చే ఆదాయానికి అదనంగా చేరి, మొత్తం ఆదాయం సులభంగా రెట్టింపు అవుతుంది.

రైతులకు అండగా విశ్వవిద్యాలయం : ఈ నూతన పద్ధతిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉంది. ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్‌డీ పర్మార్, రైతులు సుఖ్‌దేవ్ సింగ్, అల్పేష్‌భాయ్ ఠాకూర్ వంటి వారి అనుభవాన్ని రంగరించి, ఆసక్తి ఉన్న రైతులకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. పట్టు పురుగుల పెంపకం ప్రారంభించాలనుకునే ఔత్సాహిక రైతులు, అవసరమైన గొంగళి పురుగులను నేరుగా దాంతీవాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచే పొందవచ్చని వారు తెలిపారు. మొత్తం మీద, గిట్టుబాటు ధరల్లేక, ప్రకృతి వైపరీత్యాలతో సతమతమయ్యే ఆముదం రైతులకు నూతన ఆవిష్కరణ ఓ గొప్ప ఊరట. సరైన ప్రణాళికతో ఆముదం సాగుకు సెరీకల్చర్‌ను జోడిస్తే, రైతుల ఇంట లాభాల పంట పండటం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News