CBI digital arrest raids : దేశాన్ని కుదిపేస్తున్న సరికొత్త సైబర్ నేరాల పడగకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కళ్లెం వేసింది. ఇంట్లోనే కూర్చున్న అమాయకులను టార్గెట్ చేస్తూ, పోలీసులమంటూ బెదిరించి కోట్లు కొల్లగొడుతున్న డిజిటల్ అరెస్ట్ (Digital Arrest) ముఠాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
ఉమ్మడి సోదాలు – లక్ష్యాలు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు, దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని దాదాపు 89 ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా మూడు కీలక డిజిటల్ అరెస్ట్ కేసులను అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బిట్స్ ప్లానీ బాధితుడి నుంచి రూ. 7.67 కోట్లు, గుజరాత్‌లో రూ. 19.24 కోట్లు, కర్ణాటకలో రూ. 15.45 కోట్ల మేర మోసాలు జరిగినట్లు గుర్తించి మొత్తం రూ. 42.36 కోట్ల లావాదేవీలపై దృష్టి పెట్టారు.
నిందితుల గుర్తింపు – అరెస్టులు: బాధితుల నుంచి లూటీ చేసిన సొమ్మును దారి మళ్లించడం, మనీలాండరింగ్‌కు పాల్పడటంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన ఆకాశ్, కోల్‌కతాకు చెందిన రాజా కర్మకార్ తదితరుల ఖాతాల ద్వారా నిధులు బదిలీ అయినట్లు సాంకేతిక ఆధారాలతో తేల్చారు. భారీ సాంకేతిక విశ్లేషణల ద్వారా ఈ నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్న సీబీఐ, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.

