Delhi Liquor Scam CBI: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా పలువురికి ఊరట లభించిన కాసేపటికే బిగ్ షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టు మెట్లెక్కింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో సహా 23మందికి డిశ్చార్జ్ లభించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు.. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నాయని, కేవలం అనుమానాలతో కేసు నడపలేమని జడ్జి జితేందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆరోపణలకు తగిన ఆధారాలు, సాక్ష్యాలు లేవని పేర్కొంటూ నిందితులను విడుదల చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చారు.
Also Read: https://teluguprabha.net/telangana/ex-mlc-kavitha-comments-on-ktr-regarding-delhi-liquor-scam-case/
ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే సీబీఐ దానిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని, కేసును తిరిగి విచారణకు స్వీకరించాలని సీబీఐ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. కేజ్రీవాల్, సిసోడియా, కవిత వంటి కీలక నేతలకు ఈ తీర్పుతో పెద్ద ఊరట లభించినా.. సీబీఐ అప్పీల్‌తో న్యాయపోరాటం ఇప్పుడు హైకోర్టుకు చేరడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.

