ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు
నేరపూరిత కుట్ర, మోసం, నిధుల మళ్లింపు కోణాల్లో విచారణ వేగవంతం
న్యూఢిల్లీ, (తెలుగుప్రభ): ఎస్సెల్ గ్రూప్ మాజీ ఛైర్మన్ సుభాష్ చంద్రకు ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగాన బిగ్ షాక్ తగిలింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి తీసుకున్న సుమారు రూ. 980 కోట్ల రుణాల చెల్లింపులో భారీ అక్రమాలు, నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆయనపై కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, అక్రమంగా లబ్ధి పొందారనే సెక్షన్ల కింద ఈ ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ హెడ్‌క్వార్టర్స్ గురువారం నమోదు చేసింది.
ఆస్తుల విలువలో అంతుచిక్కని వ్యత్యాసం
ఈ కేసు విచారణలో ప్రధానాంశం సుభాష్ చంద్ర ఆస్తుల విలువ లెక్కల్లో వెలుగుచూసిన భారీ వ్యత్యాసమే. రెండు వేర్వేరు రుణాలకు గ్యారెంటర్‌గా వ్యవహరించిన సమయంలో ఆయన సమర్పించిన నికర ఆస్తుల పత్రాలు, తదనంతరం దివాలా పరిష్కార ప్రక్రియలో ఆయన స్వయంగా సమర్పించిన లెక్కలకు అస్సలు పొంతన లేకపోవడాన్ని సీబీఐ గుర్తించింది. వసంత సాగర్ ప్రాపర్టీస్, పాన్ ఇండియా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీల వ్యాపార విస్తరణకు ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ రూ. 500 కోట్ల రుణం ఇచ్చింది.
దీనికి మార్చి 2018లో సుభాష్ చంద్ర గ్యారెంటర్‌గా ఉన్నారు. మార్చి 2017 నాటికి సుభాష్ చంద్ర ఆస్తుల విలువ ఏకంగా 6,197 మిలియన్ డాలర్లు (నేటి మారకంలో సుమారు రూ. 59,000 కోట్లు) అని డీఐఎమ్ అండ్ కో చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ పత్రాలు ఇచ్చింది. డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, స్పిరిట్ ఇన్‌ఫ్రా పవర్ కంపెనీల రుణం కోసం జూలై 2018లో ఎంపేజే అండ్ కో ఇచ్చిన పత్రాల ప్రకారం సుభాష్ చంద్ర నెట్ వర్త్ రూ. 40,000 కోట్లకు పైగా ఉందని చూపించారు.
దివాలా పిటిషన్‌లో మాట మార్చిన సుభాష్ చంద్ర
మొత్తం రూ. 980 కోట్ల రుణాలు డిఫాల్ట్ కావడంతో సుభాష్ చంద్రపై ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్సీ కోడ్’ (IBC) కింద వ్యక్తిగత దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. తీవ్రమైన విషయమేమిటంటే.. ఈ దివాలా విచారణల సందర్భంగా సుభాష్ చంద్ర ఆ రుణ పత్రాల్లో చూపించిన వేల కోట్ల ఆస్తుల వివరాలను అంగీకరించడానికి తిరస్కరించారు. 2024 సంవత్సరానికి గాను తన నికర ఆస్తుల విలువ కేవలం రూ. 31.79 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే 2017-18 కాలంలో కూడా తన ఆస్తులు అంత భారీ స్థాయిలో లేవని ఆయన మాట మార్చడం కలకలం రేపింది.
లక్ష్యం దారిమళ్లిందా? సీబీఐ వేట షురూ
రుణాలు పొందేందుకు కావాలనే నకిలీ లేదా పెంచిన ఆస్తుల ధృవీకరణ పత్రాలను సృష్టించారా? ఈ పత్రాల తయారీ వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. రుణంగా తీసుకున్న రూ. 980 కోట్ల నిధులను ఏ ప్రయోజనం కోసం కేటాయించారో దానికే వాడారా? లేక వేరే మార్గాల్లోకి మళ్లించారా? అనే కోణంలో రుణాలు తీసుకున్న సంస్థలు, గ్యారెంటర్లు మరియు బ్యాంకింగ్ అధికారుల పాత్రపై సీబీఐ దృష్టి సారించింది. పత్రాల పరిశీలనలో అధికారుల వైఫల్యాన్ని కూడా దర్యాప్తు పరిధిలోకి తీసుకొచ్చారు.

