Friday, March 13, 2026
Homeనేషనల్CBSE Exams: సీబీఎస్సీ 10వ, 12వ తరగతి పరీక్షలు వాయిదా..?

CBSE Exams: సీబీఎస్సీ 10వ, 12వ తరగతి పరీక్షలు వాయిదా..?

CBSE Board Exams:దేశవ్యాప్తంగా సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, పన్నెండో తరగతి పరీక్షలు ఏప్రిల్ 10 వరకు కొనసాగనున్నాయి. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

అమెరికా, ఇరాన్ పరిస్థితుల మధ్య..

ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో మార్చి 7, 2026న జరగాల్సిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేశారని ఒక సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో భద్రతా కారణాల వల్ల పరీక్షలు నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది.

Also Read:https://teluguprabha.net/national-news/panneerselvam-joins-dmk-ahead-of-tamil-nadu-polls/

పరీక్షలను వాయిదా..

ఆ ప్రచారంలో భాగంగా బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లోని సీబీఎస్సీ అనుబంధ పాఠశాలల్లో మార్చి 7న నిర్వహించాల్సిన పదో తరగతి, పన్నెండో తరగతి సోషల్ సైన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 28 వరకు జరిగిన లాంగ్వేజ్ పరీక్షలు కూడా రద్దు చేసినట్లు ఆ సర్క్యులర్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని అందులో చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.

సీబీఎస్సీ బోర్డు అధికారికంగా..

ఈ ప్రచారం నేపథ్యంలో సీబీఎస్సీ బోర్డు అధికారికంగా స్పందించింది. దుబాయ్ సీబీఎస్సీ కార్యాలయం పేరుతో ప్రచారంలో ఉన్న సర్క్యులర్ పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. అలాంటి ప్రకటనను బోర్డు ఎప్పుడూ విడుదల చేయలేదని వెల్లడించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి అపోహలకు లోనుకాకుండా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్నే నమ్మాలని సూచించింది.

దుబాయ్‌లోని సీబీఎస్సీ ప్రాంతీయ కార్యాలయం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్, విదేశీ సీబీఎస్సీ పాఠశాలల అధిపతి డాక్టర్ రామ్ శంకర్ ఈ అంశంపై సీబీఎస్సీ ప్రధాన కార్యాలయానికి వివరణాత్మక నివేదిక అందజేశారు. సోషల్ మీడియాలో తిరుగుతున్న సర్క్యులర్‌లోని వివరాలను ఆయన ఖండించారు.

సీబీఎస్సీ అధికారిక సోషల్ మీడియా…

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సీబీఎస్సీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు మరియు వెబ్‌సైట్ ద్వారా వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని ఆయన సూచించారు. స్థానిక నియంత్రణ సంస్థలు, భారత రాయబారి, కాన్సుల్ జనరల్, సీబీఎస్సీ చైర్మన్‌లతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని బోర్డు స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారమే పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. విద్యార్థులు తమ పరీక్షలకు సిద్ధమవుతూ అపోహలకు గురికాకుండా ఉండాలని సూచించింది.

Also read:https://teluguprabha.net/national-news/modi-condemns-attacks-on-uae-speaks-to-uae-president/

ఇప్పటికే సీబీఎస్సీ పరీక్షలు దేశవ్యాప్తంగా 10వ తరగతికి 8,074 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. 12వ తరగతికి 7,574 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. విదేశాల్లో మొత్తం 26 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం 43 లక్షలకు పైగా విద్యార్థులు ఈసారి సీబీఎస్సీ బోర్డు పరీక్షలు రాస్తున్నారు.

అధికారిక ప్రకటన ప్రకారం…

సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు విద్యార్థుల్లో ఆందోళన కలిగించినప్పటికీ, అధికారిక ప్రకటన ప్రకారం మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా పరీక్షలు యథావిధిగా కొనసాగనున్నాయి. బోర్డు ఇచ్చిన స్పష్టీకరణతో వాయిదా ప్రచారం అసత్యమని తేలింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News