Homeనేషనల్CBSE : సీబీఎస్‌ఈ 'డిజిటల్' దగాపై పార్లమెంటరీ ప్యానెల్ కొరడా: చైర్‌పర్సన్‌, విద్యాశాఖ కార్యదర్శికి సమన్లు..

CBSE : సీబీఎస్‌ఈ ‘డిజిటల్’ దగాపై పార్లమెంటరీ ప్యానెల్ కొరడా: చైర్‌పర్సన్‌, విద్యాశాఖ కార్యదర్శికి సమన్లు..

CBSE OSM controversy parliamentary panel summons : దేశంలో కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును శాసించే సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల మూల్యాంకనం ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీసింది. టెక్నాలజీ పేరుతో ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ విధానం (OSM – On-Screen Marking) ఆచరణలో కొంపముంచిందా? అవుననే అంటున్నాయి దేశవ్యాప్తంగా వస్తున్న వరుస ఫిర్యాదులు 12వ తరగతి ఫలితాల మూల్యాంకనంలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు గళమెత్తడంతో పార్లమెంటరీ ప్యానెల్ రంగంలోకి దిగింది. ఏకంగా సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్ రాహుల్ సింగ్, కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్‌కు పార్లమెంటరీ విద్యాశాఖ స్టాండింగ్ కమిటీ అత్యవసర సమన్లు జారీ చేసింది. 

- Advertisement -

కమిటీ ముందు హాజరు కావాల్సిందే: పార్లమెంటరీ ప్యానెల్ కఠిన నిర్ణయం : సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) మూల్యాంకనం చుట్టూ ముసురుకున్న ఆరోపణలను పార్లమెంటరీ ప్యానెల్ తీవ్రంగా పరిగణించింది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని విద్యాశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం పార్లమెంట్ హౌస్ అనెక్స్ (PHA) లో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాలు, మార్కుల తారుమారు మరియు విద్యార్థుల భవిష్యత్తుకు జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాల్సిందిగా సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్ రాహుల్ సింగ్, కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్‌లకు సమన్లు జారీ చేసింది. ఈ సమావేశంలో విద్యార్థి ప్రతినిధులు కూడా స్వయంగా పాల్గొని తాము ఎదుర్కొన్న సవాళ్లు, సాంకేతిక అవకతవకలపై కమిటీకి ప్రత్యక్షంగా వివరించే అవకాశం ఉంది.

రంగంలోకి సైబర్ నిపుణులు.. ‘సర్ట్-ఇన్’ ప్రమేయం ఎందుకు : ఈ డిజిటల్ మూల్యాంకన విధానం కేవలం చిన్నపాటి సాంకేతిక పొరపాటు మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా వ్యవస్థాగత భద్రతా లోపాలు ఉన్నాయా అనే కోణంలో కమిటీ లోతుగా పరిశీలిస్తోంది. దీనికోసం ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) డైరెక్టర్ జనరల్‌కు కూడా కమిటీ సమన్లు పంపింది డిజిటల్ ప్లాట్‌ఫారమ్ డేటా సమగ్రత (Data integrity), సైబర్ రక్షణ వ్యవస్థల పటిష్టతపై సర్ట్-ఇన్ సమర్పించబోయే నివేదిక ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

త్రిభాషా విధానంపై కూడా సమీక్ష : కేవలం 12వ తరగతి ఓఎస్ఎం మూల్యాంకనమే కాకుండా, సెకండరీ స్థాయిలో 9, 10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తీసుకురావడంపై కూడా ఈ పార్లమెంటరీ కమిటీ సుదీర్ఘంగా చర్చించనుంది. ఈ విధానం అమల్లో ఉన్న సవాళ్లు, వివిధ రాష్ట్రాల్లోని విద్యార్థులపై ఇది చూపే ప్రభావాల గురించి విద్యాశాఖ అధికారుల నుంచి నివేదికలు కోరుతోంది.

అందుబాటులోకి వచ్చిన ‘వెరిఫికేషన్’ పోర్టల్.. ఒకరోజు ఆలస్యంగానే : ఒకవైపు రాజకీయ రచ్చ కొనసాగుతుండగానే, తీవ్ర నిరీక్షణకు గురిచేసిన 12వ తరగతి రీవాల్యుయేషన్, వెరిఫికేషన్ పోర్టల్ ఎట్టకేలకు మంగళవారం అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి జూన్ 1న ప్రారంభం కావాల్సిన ఈ పోర్టల్ తీవ్ర సాంకేతిక అంతరాయాల కారణంగా ఒక రోజు ఆలస్యంగా జూన్ 2న ప్రారంభమైంది. సీబీఎస్‌ఈ హెడ్‌క్వార్టర్స్ ఈ విషయమై ‘ఎక్స్’  వేదికగా వివరణ ఇస్తూ.. ప్రస్తుతం పోర్టల్ సజావుగా పనిచేస్తోందని, విద్యార్థులు తమ రీ-వాల్యుయేషన్ దరఖాస్తులను జాగ్రత్తగా సమర్పించాలని కోరింది. ఈ పోర్టల్ జూన్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి విద్యార్థులు త్వరగా స్పందించాలని సూచించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News