జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror attack)ఘటనపై సెలబ్రెటీలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్ జూనియర్ ఎన్‌టీఆర్, విజయ్ దేవరకొండ, మంచు విష్ణు తదితర ఇండస్ట్రీ ప్రముఖులు ఎక్స్ వేదికగా స్పందించారు.
“జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న దారుణమైన దాడి భయంకరమైనది, హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి జరిగిన నష్టాన్ని ఏదీ పూరించలేదు. వారి కోసం నా సంతాపం, ప్రార్థనలు” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
“పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధించింది. ఇటువంటి సంఘటనలకు మన సమాజంలో చోటు లేదు. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. ఈ కష్ట సమయాన్ని తట్టుకుని నిలబడే మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని దేవుడు బాధిత కుటుంబాలకు ఇవ్వాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను” అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
“పహల్గాం దాడి బాధితుల గురించి తెలిసి హృదయం ద్రవించిపోయింది. దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నా” అని తారక్ రాసుకొచ్చారు.
“పహల్గామ్ ఘటన దేశ చరిత్రలో ఒక చీకటిరోజు అని చెప్పారు. ఇలాంటి క్రూరమైన దాడికి వ్యతిరేకంగా మనమందరం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని మహేశ్ బాబు వెల్లడించారు.
‘‘రెండేళ్ల క్రితమే నా పుట్టినరోజును పహల్గాంలో సెలబ్రేట్ చేసుకున్నాను. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా అక్కడికి వెళ్లిన నేను.. కశ్మీర్‌లోని అందమైన ప్రాంతంలో అక్కడి ప్రజల స్వచ్ఛమైన నవ్వుల మధ్య నా పుట్టినరోజు చేసుకున్నాను. స్థానికంగా ఉండే కశ్మీరీ స్నేహితులు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. నిన్న ఆ ప్రాంతంలో జరిగినది విని నా హృదయం పగిలిపోయింది. ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం సిగ్గుచేటు. ఇలాంటి పిరికి వాళ్లను త్వరలోనే అంతమొందిస్తారని ఆశిస్తున్నా. భారతదేశం ఉగ్రవాదానికి ఎప్పటికీ తలవంచదు’’ అని విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు.